తెలంగాణలో ఎన్నికలు అయిపోలే.. మరో 4 నెలలైనా ఉన్నట్లే..

దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. మొత్తం ఏడు దశలకుగాను నాలుగు దశల పోలింగ్ పూర్తయింది.

Update: 2024-05-17 13:30 GMT

దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. మొత్తం ఏడు దశలకుగాను నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే దశలో ఎన్నికలు జరిగాయి. మరోవైపు ఈ నెల 20న ఐదో దశ ఎన్నికలున్నాయి. ఆరో దశ 25న, ఏడో దశ జూన్ 1న ఉంది. మరో 17 రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే మార్చి 16న లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అప్పటినుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 4 వరకు ఇది కొనసాగనుంది.


అంతకుముందు తెలంగాణ ఎన్నికలు..

తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబరు 3న ఫలితాలు వచ్చాయి. ఇక వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న మరుసటి రోజే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనికిముందు అసెంబ్లీ ఎన్నికలకు నవంబరు 3న షెడ్యూల్ వచ్చింది. అంటే జూన్ 4తో ముగిసే కోడ్ వరకు చూస్తే.. ఏడు నెలల్లో దాదాపు నాలుగు నెలలు కోడ్ లోనే ఉంది.

మళ్లీ ఎన్నికలున్నాయి..

తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. జూన్ నుంచి స్థానిక సంస్థల సమరం జరగనుంది. అధికారం కాంగ్రెస్ కు ఇవి చాలా కీలకం. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీల దృష్టి వీటిపైనే ఉంటుంది. కేడర్ ను లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అన్ని పార్టీల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలిస్తామని హామీలిచ్చారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధం

రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా రిజర్వేషన్ల వివరాలను సేకరించింది. పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తోంది.

ప్రత్యేక పాలనలో..

తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరిలోనే పూర్తయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 3తో ముగుస్తుంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానిదే తుది నిర్ణయం. ముందుగా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది.

కొసమెరుపు: తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి నాయకత్వపరంగానూ బలహీన పడింది. చాలామంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే వీరందరినీ తిరిగి గుంజుకోవాల్సి ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ వారినీ ఆకర్షించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News