తెలంగాణా బీజేపీలో కొత్త వివాదం
ఊహించినదానికన్నా దరఖాస్తుల వెల్లువ రావటంతో అందరు హ్యాపీగానే ఉన్నారు. కానీ సరిగ్గా ఇక్కడే మరో వివాదం మొదలైంది
రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీలో కొత్త వివాదం రాజుకుంది. అదేమిటంటే పోటీచేయాలనే ఆసక్తి ఉన్న నేతలంతా తప్పనిసరిగా దరఖాస్తులు చేయాల్సిందే అన్నది అగ్రనేతలు విధించిన షరతు. దాని ప్రకారమే 10వ తేదీతో దరఖాస్తుల గుడువు ముగిసింది. 10వ తేదీ సాయంత్రానికి రికార్డుస్ధాయిలో 119 నియోజకవర్గాలకు 6011 దరఖాస్తులు వచ్చాయి. ఇన్నివేల దరఖాస్తులు వస్తాయని బహుశా పార్టీ అగ్రనేతలే ఊహించుండరు అనటంలో సందేహంలేదు.
ఊహించినదానికన్నా దరఖాస్తుల వెల్లువ రావటంతో అందరు హ్యాపీగానే ఉన్నారు. కానీ సరిగ్గా ఇక్కడే మరో వివాదం మొదలైంది. అదేమిటంటే పార్టీ ఎంపీలు ఎవరూ దరఖాస్తులు చేసుకోలేదు. సికింద్రాబాద్ ఎంపీ, పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ పోయం బాబూరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీనంగర్ ఎంపీ, జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ దరఖాస్తులు చేసుకోలేదు. వీళ్ళతో పాటు రాజ్యసభ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా దరఖాస్తు చేసుకోలేదు.
పార్టీలో అగ్రనేతల నుండి కిందస్ధాయి కార్యకర్తవరకు అందరు ఒకటే అని చెబుతున్నపుడు మరి పై ఐదుగురు ఎంపీలు ఎందుకు దరఖాస్తులు చేసుకోలేదనే చర్చ మొదలైంది. కిషన్ రెడ్డి అంబర్ పేట, అర్వింద్ ఆర్మూరు, బండి కరీనంగర్, లక్ష్మణ్ ముషీరాబాద్, బాబూరావు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నారని అందరికీ తెలుసు. అలాగే ఈటల రాజేందర్ కూడా దరఖాస్తు చేయలేదు.
పైగా ఈటల, ఈటల భార్య జమునారెడ్డి తరపున గజ్వేలుకు దరఖాస్తులు అందాయి. గజ్వేలుకు తాము దరఖాస్తులు చేసుకోలేదని, తమ మద్దతుదారులు ఎవరన్నా దరఖాస్తులు చేసుండచ్చని ఈటల చెప్పారు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే టికెట్ కోసం తాము కూడా దరఖాస్తు చేసుకోవాలా అన్న ఆలోచనతో ఉన్నారని అనుకుంటున్నారు. ఇక్కడే దరఖాస్తులు చేసుకున్న సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలకు మండిపోతోంది. పై ఐదారుగురు దరఖాస్తులు చేసుకోలేదు కాబట్టి వారికి ఎక్కడా టికెట్లు ఇవ్వకూడదని బలంగా వినిపిస్తోంది. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.