ఐదేళ్ల కిందట అప్రాధాన్యం.. ఇప్పుడు సీనియర్ మంత్రిదే సందడి
తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి ఆయన.. ఉద్యమ సమయంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించారు
తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి ఆయన.. ఉద్యమ సమయంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ఏ సమస్య వచ్చినా.. పరిష్కరించేందుకు ఆయనను ముందుంచేవారు. అయితే, గత ఎన్నికల సందర్భంగా ఆయనకు క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన ప్రాధాన్యం బాగా తగ్గించేశారు. అది ఎంతలా అంటే.. కనీసం పట్టించుకోనంతగా. అయితే, దీనికి ప్రధాన కారణం ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారనే అనుమానం రావడమే. ఈ కారణంగానే రెండోసారి ప్రభుత్వం కొలువుదరినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాలేదు. చివరకు ఏడాదిపైగా విరామం అమాత్య పదవి వరించింది.
నాడు కంట నీరు పెట్టుకుని..
గత ఎన్నికలు తెలంగాణలో అత్యంత హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. నాడు చావోరేవో అన్నరీతిలో బీఆర్ఎస్ పార్టీ పోరాడింది. అటు వైపు కాంగ్రెస్-టీడీపీ-వామపక్షాల కూటమిని ఎదుర్కొంటూ అత్యద్భుత విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికలకు ముందు సీనియర్ మంత్రి తన పరిస్థితిని తలచుకుని ఉద్వేగానికి కూడా గురయ్యారు. ప్రజల అభిమానాన్ని దేనితోనూ కొలవలేమని కంటతడి పెట్టారు. ఈ సన్నివేశం ఆయన ఇబ్బందుల్లో ఉన్నారని చాటింది.
నేడు అంతా తానే అయి..
ఆ సీనియర్ మంత్రికి అధికార పార్టీ అధిష్ఠానంతో తలెత్తిన ఈ విభేదాలు ఏడాది, రెండేళ్లలో సమసిపోయాయి. దీంట్లోనూ మరో సీనియర్ మంత్రిని ఉద్వాసన పలకడంతో తప్పని పరిస్థితుల్లో ఈయనకు ప్రాధాన్యం దక్కింది. నాటి నుంచి వెనక్కుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. ఇక ఇప్పటి ఎన్నికలకు వస్తే అధిష్ఠానం అండదండలతో ఆ సీనియర్ మంత్రి హవా మామూలుగా సాగడం లేదు. ఓవైపు రాష్ట్ర పర్యటనలు చేస్తూనే.. మరోవైపు పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో ప్రచారంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
కొసమెరుపు: తాజా ప్రాధాన్యం నేపథ్యంలో ఆ సీనియర్ మంత్రి నివాసం అత్యంత సందడిగా ఉంటోంది. టికెట్ల మంజూరు సమయంలో అయితే ఆయన ఇంటి వద్ద పొద్దున నుంచి రాత్రి వరకు పెద్దఎత్తున నాయకులు ఉండేవారు. వారికోసం వంటావార్పుతో పొద్దంతా పొయ్యి వెలుగుతూనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికీ నాయకుల సందడి తగ్గలేదని.. మరి రెండు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని వివరిస్తున్నారు.