కేసీయార్ పై సీనియర్లు మండిపోతున్నారా ?
ఏ పార్టీలో అయినా ఉండేవే కాబట్టి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దానంతట అదే సర్దుకుంటుందని అనుకుంటే వ్యవహారం అందుకు రివర్సులో నడుస్తోంది
ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ పార్టీలో కేసీయార్ కు తలనొప్పులు ఎక్కువైపోతున్నాయి. ఏ పార్టీలో అయినా ఉండేవే కాబట్టి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దానంతట అదే సర్దుకుంటుందని అనుకుంటే వ్యవహారం అందుకు రివర్సులో నడుస్తోంది. తాజాగా పార్టీలోని సీనియర్లు ఒక్కొక్కళ్ళే కేసీయార్ పై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. రెండురోజుల క్రితమే మాజీ ఎంపీ మందా జగన్నాధం మండిపోయారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వబోవటంలేదు కాబట్టి తన కొడుక్కి అసెంబ్లీ టికెట్ ఇస్తానని ప్రామిస్ చేసిన కేసీయార్ మోసం చేసినట్లు మండిపోయారు.
దాని ప్రభావం ఇంకా సర్దుకోకముందే మరో మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ మీడియాకెక్కారు. ప్రత్యేక తెలంగాణా కోసం తాను ఎంతో పోరాటం చేశానని, కేసీయార్ అడుగులో అడుగేసినడిచినట్లు చెప్పారు. అలాంటి తనను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా పెడుతున్నారో అర్ధంకావటంలేదని మండిపోయారు. ఇన్ని సంవత్సరాలు పార్టీలో పనిచేసి ఇంత వయసులో ఎదురవుతున్న అవమానాలను తట్టుకోవట కష్టంగా ఉందని వాపోయారు.
ఇక్కడ సమస్య ఏమిటంటే బీఆర్ఎస్ పై కేసీయార్ పట్టు జారిపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సీనియర్లకు జూనియర్లకు మధ్య అంతరాలు బాగా పెరిగిపోతున్నాయి. మంత్రులు ఎంఎల్ఏలను లెక్కచేయటంలేదు. ఎంఎల్ఏలు సీనియర్ నేతలను పట్టించుకోవటంలేదు. సీనియర్ నేతలకు పార్టీ క్యాడర్ కు మధ్య పెద్ద గ్యాప్ వచ్చేసింది. ఏ విధంగా చూసుకున్నా పార్టీలోని వివిధ స్ధాయి నేతల మధ్య తీవ్రస్ధాయిలో గ్యాప్ వచ్చేసినట్లు అర్ధమవుతోంది.
ఇప్పటికే కొందరు సీనియర్లు కేసీయార్ వైఖరిపై మండిపోయి పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. మరికొందరు పార్టీలోనే ఉన్నా అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత సర్దుకుంటుందని అనుకుంటే అదికాస్త ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మందా జగన్నాధం అంటే ఎస్సీ నేత, సీతారామ్ నాయక్ అంటే ఎస్టీ నేతని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎంతమంది కేసీయార్ వ్యవహార శైలిపై మండిపోతున్నారో తెలీదు. ఇపుడు బయటపడుతున్న సీనియర్ల అంసతృప్తితో పార్టీకి నష్టం తప్పదనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇదే కారణాలపైన జూనియర్లు, టికెట్ల దక్కనివాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు కాబట్టే.