కేసీఆర్ ఆ వ్యాఖ్యలపైనే ఇప్పుడు చర్చంతా!
తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల తూటాలు పేలుస్తున్నారు. మరోసారి ఆయన ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలవడానికే ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల వరకు 100 నుంచి 110 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని నొక్కి వక్కాణించిన ఆయన తొలిసారి ఓటమి గురించి మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు. తాము ఓడిపోతే తమకు నష్టమేమీ లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలే ఆగమైపోతారన్నారు. తాము ఎన్నికల్లో ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని.. ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుందని కేసీఆర్ వెల్లడించారు. ఓటు వేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించకపోతే, బీఆర్‌ఎస్ కు ఓటేయకపోతే నష్టపోయేది ప్రజలేనన్నారు.
ఇక్కడే కేసీఆర్ పై సెటైర్లు పడుతున్నాయి. కేసీఆర్ గతంలో అన్నట్టు ప్రతి పార్టీ సన్యాసుల మఠం ఏమీ కాదు. అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఏ పార్టీని అయితే ప్రజలు నమ్ముతారో ఆ పార్టీకే ప్రజలు ఓటేస్తారు. ప్రజల విశ్వాసం చూరగొన్న పార్టీయే అధికారంలోకి వస్తుంది.
బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే ప్రజలు నష్టపోతారని.. తమకేం నష్టం లేదని.. రెస్టు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే ప్రజలు ఎందుకు నష్టపోతారనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న 90 శాతానికి పైగా పథకాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినవే.
ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటకలో అమలు చేసినట్టే ఆరు పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఆ పార్టీ చెబుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొన్ని కొత్త పథకాలను ప్రకటించడం, అమలు చేయడం రివాజు.
తాను అధికారంలోకి రాకపోతే ప్రజలకు నష్టం జరుగుతుందని కేసీఆర్ చెప్పడమే వింతల్లో కెల్లా వింత అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే నష్టపోయేది ఆ పార్టీ నేతలే తప్ప ప్రజలు కాదని స్పష్టం చేస్తున్నారు. అధికారానికి, ఆడంబరాలకు దూరమై నష్టపోయేది బీఆర్‌ఎస్ నేతలే తప్ప ప్రజలెందుకు అవుతారని నిలదీస్తున్నారు. బీఆర్‌ఎస్ ఓటమి తెలంగాణ ప్రజలకు ఎలా నష్టం చేకూరుస్తుందని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.