బెడిసి కొట్టిన షర్మిల పాలిటిక్స్.. ఉలుకు పలుకు లేని కాంగ్రెస్
వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది.
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుందనేది కలే! ఇప్పుడు ఇదే పరిస్థితి వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైటీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎదురైందా? ఆమె హవా ఇప్పుడు రివర్స్ గేర్ కొట్టిందా? అంటే.. ఔననే అంటున్నారు తెలంగాణ రాజకీయ విశ్లేషకులు. రెండేళ్ల కిందట సొంతగా పార్టీని ప్రారంభించి.. తాను తెలంగాణ కోడలినని, తెలంగాణలోనూ వైఎస్సార్(రాజన్న) పాలనను తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేసిన ఆమె సొంత పార్టీకోసం బాగానే కష్టపడ్డారు.
మధ్యలో పాదయాత్ర కూడా చేపట్టారు. సుదీర్ఘ లక్ష్యం నిర్దేశించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎదురైన కొన్ని ఇబ్బందులను కూడా తట్టుకుని.. నిలబడ్డారు. పార్టీలో ఎవరు చేరినా.. ఎవరు చేరకున్నా.. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎదురు నిలిచి ముందుకు సాగారు. ఒకానొకదశలో మంగళవారం మరదలు అనే తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ.. షర్మిల ముందుకు సాగారు. అయితే.. మధ్యలో అనూహ్య పరిణామం తెరమీదికి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. ఆమెను పార్టీలో చేర్చుకోవడంతోపాటు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. ఇంకేముంది.. కాంగ్రెస్‌లో కీలక నాయకురాలిగా షర్మిల ఎదగడం ఖాయమని అనుకున్నారు. అంతేకాదు.. ఢిల్లీకి వెళ్లి సోనియాతోనూ ఆమె భేటీ అయ్యారు. కర్ణాటకకు వెళ్లి..అక్కడి డిప్యూటీ సీఎం శివకుమార్‌తోనూ పదే పదే చర్చలు జరిపారు. దీంతో ఇక, షర్మిల కాంగ్రెస్ గూటికి చేరుతుందని.. ఆమె శపథం చేసినట్టుగా పాలేరు(ఉమ్మడి ఖమ్మం జిల్లా) నుంచి పోటీ ఖాయమని అనుకున్నారు.
అయితే, అనూహ్యంగా ఈ వ్యూహం ఎక్కడో బెడిసి కొట్టింది. తెలంగాణలో రెండు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. వీరి సమక్షంలో నే ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, షర్మిల విషయం మాత్రం మాట మాత్రంగా కూడా ప్రస్తావనకు రాలేదు. కనీసం ఆమె ఊసు కూడా ఎక్కడా వినిపించలేదు.
దీంతో కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం షర్మిల విషయంలో ఇంట్రస్ట్ చూపించడం లేదనే చర్చ తెరమీదికి వచ్చింది. అంతేకాదు, షర్మిల పొలిటికల్ గ్రాఫ్‌కు సంబంధించి కూడా కాంగ్రెస్ సర్వేలు చేయించిందని.. ఈ సర్వేల్లో అత్యంత ఘోరమైన రిజల్ట్ వచ్చిందని.. ఏమాత్రం కూడా షర్మిలకు తెలంగాణ ప్రజల ఆదరణ లేదని తేలిపోయిందని, పాలేరు టికెట్ ఇచ్చినా ప్రయోజనం లేదని రూఢీ అయిందని.. దీంతో ఆమెను చేర్చుకున్నా.. ఉపయోగం లేదని కాంగ్రెస్ ఒక నిర్ధారణకు వచ్చే.. షర్మిల విషయంలో మౌనం దాల్చిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి షర్మిల పొలిటికల్ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.