యూఎస్ ఎన్నికల్లో "తెలుగు" హవా... ప్రచారం నుంచి సమాచారం వరకూ..!

డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ గా జరగనున్న ఈ అగ్రరాజ్య అధ్యక్ష పీఠ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందని అంటున్నారు.

Update: 2024-10-15 08:00 GMT

మరో రెండు వారాల తర్వాత జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ గా జరగనున్న ఈ అగ్రరాజ్య అధ్యక్ష పీఠ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందని అంటున్నారు. ఈ సమయంలో "తెలుగు" హవా హాట్ టాపిక్ గా మారింది.

అవును... అమెరికాలో భారతీయుల స్థానం కీలకం అనే చెప్పాలి. అక్కడ భారతీయ సంప్రదాయాలకూ, పండగలకూ ఎంతో గౌరవం దక్కుతుంటుంది. ఇక అమెరికాలో ఉన్నత స్థానాల్లో చాలా మంది భారత సంతతికి చెందినవారే ఉన్నారు. ఇక ఉపాధ్యక్షురాలు, ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మూలాలు భారత్ లోనే ఉన్న సంగతి తెలిసిందే.

మరోపక్క రిపబ్లికన్లు తమ శిబిరంలో డొనాల్డ్ ట్రంప్ రన్నింగ్ మేట్ అయిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరితో కూడా భారత ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్న్నికల్లో ప్రవాస భారతీయ ఓటర్ల మద్దతు కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగులో ఫ్లెక్సీలు కనిపించాయి.

ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. డల్లాస్ లో తెలుగు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఫ్లెక్సీలు కనిపించాయి. వీటితో పాటు తమిళ, ఇంగ్లిష్ భాషల్లో ఉన్న పోస్టర్లు పక్కనే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలూ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో... ఈ మార్పు యూఎస్ రాజకీయాల్లో భారతీయ ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని అంటున్నారు.

ఇలా డల్లాస్ లో కనిపించిన ఈ ఫ్లెక్సీల్లో "సంస్కృతి, సన్మార్గం.. దేశానికి ఆధారం" అని రాసి ఉంది. ఇదే సమయంలో... రిపబ్లికన్ లకు ఓటు వేయాలని ఉండటం గమనార్హం. అంతే కాకుండా... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల సమాచారాన్ని 14 భాషల్లో ముద్రించారు. వీటిలో 3 భారతీయ భాషలు ఉండగా.. అందులో ఒకటి తెలుగు కావడం తెలువారందరికీ గర్వకారణం!!

Tags:    

Similar News