బెట్టింగ్ యాప్స్ : రానా, విజయ్ దేవరకొండ సహా 25 మంది సినీ ప్రముఖులపై కేసు
ఈ మేరకు మియాపూర్‌కు చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.;
బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన పలువురు సినీ ప్రముఖులు చిక్కుల్లో పడ్డారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో పాటు ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి తదితర 25 మంది నటీనటులు, యూట్యూబర్లపై మియాపూర్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు మియాపూర్‌కు చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
బెట్టింగ్ యాప్‌ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించి మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ యాప్‌లను కొందరు సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు భారీగా ప్రమోట్ చేయడంతో చాలా మంది వీటి బారిన పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో ప్రముఖంగా రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత ఉన్నారు. వీరితో పాటు బుల్లితెరపై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు కూడా ఉన్నారు.
యూట్యూబ్‌లో తమకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత కూడా ఈ కేసులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ఈ కేసుపై మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రముఖుల ప్రమేయం ఎంతవరకు ఉంది? వారు ఎంత మొత్తం తీసుకుని ఈ యాప్‌లను ప్రమోట్ చేశారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారితో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసి కోట్లు సంపాదించిన హర్ష సాయి, సన్నీ యాదవ్, రాజు భయ్యా, నటి శ్యామల, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ సన్నీతో సహా మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు స్టార్ నటీనటులపై కూడా కేసులు నమోదు కావడం సంచలనమైంది.
ప్రముఖ నటులపై తాజాగా నమోదైన కేసులు సినీ పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బెట్టింగ్ యాప్స్ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.