సర్వేలు చేసి సాధించిందేంటి? టీడీపీలో బిగ్ క్వశ్చన్!!
వీరిలోనూ ఒకటికి రెండు సార్లు, మూడు సార్లు ఓడిపోయిననాయకులు ఉండడం గమనార్హం
''వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం. త్యాగాలు చేయాలి. సర్వేల ఆధారంగా.. ప్రజల్లోఉన్న ఆదరణ ఆధారం గానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తర్వాత.. ఎవరు ఏమనుకున్నా.. నేను చేసేది ఏమీలేదు'' అని తరచు గా చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చివరకు ఏం చేశారు? ఆయన చెప్పినట్టే చేశారా? అం టే ఎక్కడా కనిపించడంలేదు. సర్వేలతో పరుగులు పెట్టించారు కానీ.. మార్పులు, చేర్పుల పరంగా ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగలేదు. గుండుగుత్తగా అందరూ పాత కాపులకే పట్టంకట్టారు. వీరిలోనూ ఒకటికి రెండు సార్లు, మూడు సార్లు ఓడిపోయిననాయకులు ఉండడం గమనార్హం.
ఉదాహరణకు.. సర్వేపల్లి(నెల్లూరు) నియోజకవర్గంలో వరుసగా ఓటమికోసమే పోటీ చేస్తున్నానా? అని అని పించిన నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఇప్పటి కిఆయన 5 సార్లుగా ఓడిపోతూ నే ఉన్నారు. ఇలాంటి చోట మార్పు తప్పదని పార్టీ వర్గాలు భావించాయి. కానీ, తాజాగా మరోసారి సోమిరెడ్డికే టికెట్ ఇచ్చి.. వైసీపీకిఇక్కడి బాటలుపరిచినట్టు అయింది. చింతలపూడి నియోజకవర్గంలో కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు. సోమా రోషన్‌ను ఇక్కడ నిలబెడుతున్నట్టు ప్రకటించారు.
కానీ, చింతలపూడిలో కొత్తవారిని గెలిపించేందుకు ఇక్కడి ప్రజలు సంసిద్ధంగా లేరు. పైగా.. ఇక్కడ పీతల సుజాత తనకే టికెట్ అంటూ.. ప్రజల మధ్య ఉన్నారు. ఈ దఫా ఆమెకు ఇచ్చి ఉంటే గెలుస్తారనే చర్చ కూడా ఉంది. కానీ, ఆమెను కాదని.. రోషన్‌ను తీసుకువచ్చారు. అసలు ఈయన గత నాలుగేళ్లలోఎక్కడా పార్టీలో కానీ.. నియోజకవర్గంలో కానీ.. చేసింది కానీ, కనిపించింది కానీ లేదు. ఇక, విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మరోసారి గద్దె రామ్మోహన్‌కే ఇచ్చారు. వాస్తవానికి ఈయన గ్రాఫ్ పడిపోయిందని పార్టీలోనే చర్చ ఉంది. అయినా.. ఆయనకే పట్టం కట్టారు.
ఇక, నూజివీడులో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పక్కన పెట్టి.. ఇంకా పార్టీలోకి కూడా చేరని కొలుసు పార్థసారథికి టికెట్ ఇచ్చారు. మరి ఏ సర్వేల ఆధారంగా ఇక్కడ ఆయనకు ఇచ్చారనేది ప్రశ్న. మైదుకూరులో(కడప)నూ ఇదే పరిస్థితి నెలకొంది. వరుస పరాజయాలు తప్ప.. గెలుపు అంచుల వరకు కూడా వెళ్లని పుట్టాసుధాకర్‌యాదవ్‌కు మరోసారి పట్టం కట్టారు. నిజానికి ఆయనకు వద్దన్న డిమాండ్ రెండేళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. అయినా.. చంద్రబాబు ఏ సర్వేల ఆధారంగా ఇచ్చారో ఆయనకే తెలియాలి. ఇతమిత్థంగా చెప్పేది ఏంటంటే.. చంద్రబాబు చెప్పిన సర్వేలు.. పేర్కొన్న ప్రజానాడి.. ఈ జాబితాలో మచ్చుకు కూడా కనిపించలేదు.