ఏపీ, తెలంగాణ.. తొలిసారి డిప్యూటీ సీఎంలిద్దరూ గట్టివారే!

ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలుగా అత్యంత బలమైన, గళం వినిపించగల, స్వతంత్రంగా వ్యవహరించగల నాయకులున్నారని చెప్పవచ్చు.

Update: 2024-06-20 17:30 GMT

‘డిప్యూటీ సీఎం..’ ఉమ్మడి ఏపీలో ‘ఆరో వేలు’ అనే అపప్రథ మూటగట్టుకుంది. 1994-2004 మధ్య చంద్రబాబు హయాంలో కానీ.. 2004 అనంతరం వైఎస్ జమానాలో కానీ.. డిప్యూటీ సీఎంలుగా ఎవరినీ నియమించలేదు. అయితే, 2009లో వైఎస్ మరణం అనంతరం మాత్రం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవిని మళ్లీ భర్తీచేశారు. ఇక తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఏర్పడిన ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం పదవులకు ప్రాధాన్యం పెరిగింది. సామాజిక సమీకరణాలు అయితేనేమి..? రాజకీయ అనివార్యతలు అయితేనేమి..? తప్పనిసరిగా డిప్యూటీ సీఎం ఉండాల్సిన పరిస్థితి.

కేసీఆర్ అలా.. చంద్రబాబు ఇలా 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కేసీఆర్ తనకు ఎంతో నమ్మకస్తుడైన మహమూద్ అలీతో పాటు రాజయ్యను డిప్యూటీ సీఎంలుగా నియమించారు. వీరిలో రాజయ్య త్వరగానే పదవిని కోల్పోయారు. ఆ చాన్స్ ను కడియం శ్రీహరి దక్కించుకున్నారు. 2018లో రెండోసారి గెలిచాక మాత్రం తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పేరే వినిపించలేదు. కాగా, 2014లో ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఇద్దరు డిప్యూటీ సీఎంల(చినరాజప్ప, కేఈ క్రిష్ణమూర్తి)ను నియమించారు.

జగన్ జమానాలో ఐదుగురు 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండడం గమనార్హం. ప్రాంతాలు, వర్గాల సమతూకంతో వీరికి ‘డిప్యూటీ’ పదవులు అప్పగించారు. అయితే, ఈ సంఖ్య ఎక్కువ అయిందనే భావన వ్యక్తమైంది.

ఇప్పుడు అటు.. ఇటు గతం సంగతి పక్కనపెడితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు చాలా గట్టివారని చెప్పక తప్పదు. తెలంగాణలో గత డిసెంబరులో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి మల్లు భట్టి విక్రమార్కకు దక్కింది. కాంగ్రెస్ ను నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్న కుటుంబం వీరిది. 2018 తర్వాత సీఎల్పీ నాయకుడిగానూ పనిచేశారు. ఓ దశలో సీఎం రేసులోనూ నిలిచారు భట్టి. ఇక మంత్రిత్వ శాఖల్లోనూ ఆయనకు విద్యుత్తు వంటి కీలక శాఖలు దక్కాయి. అంతేకాక.. వివిధ సమీక్షలు, పార్టీ పరంగా నిర్ణయాల సమయంలో భట్టికి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ విధంగానూ విస్మరించకుండా ఆయనను గౌరవిస్తున్నారు.

తాజాగా ఏపీలో ఏర్పడిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. పవన్ స్థాయికి తగినట్లుగా చంద్రబాబు సైతం ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ వంటి కీలకమైన, పవన్ కు ఇష్టమైన శాఖలను ఇచ్చారు. పాలనలోనూ పవన్ కు పెద్ద పీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలుగా అత్యంత బలమైన, గళం వినిపించగల, స్వతంత్రంగా వ్యవహరించగల నాయకులున్నారని చెప్పవచ్చు.

Tags:    

Similar News