రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరు కుమ్మేశారు!
తాజాగా వచ్చిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని రీతిలో ప్రజలు ఫలితాన్ని అందించారు
తాజాగా వచ్చిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని రీతిలో ప్రజలు ఫలితాన్ని అందించారు. ఏపీలో పార్లమెంటు స్థానాలకు సంబంధించి... 25 ఉంటే... టీడీపీ కూటమికి ఏకంగా.. 21 స్థానాల్లో ప్రజ లు జైకొట్టారు. ఇక, గత ఎన్నికల్లో వైసీపీకి 22 స్థానాలు ఇచ్చిన ప్రజలు.. ఈ సారి దానిని 4 కు దింపేశారు ఇదొక చిత్రమైన పరిస్థితి. మొత్తంగా ఊహించని విధంగా అయితే.. ఫలితాలు వచ్చాయనేది వాస్తవం. క, తెలంగాణ విషయాన్ని తీసుకుంటే.. నిన్న మొన్నటి వరకు.. చక్రం తిప్పిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రజలు బుట్టదాఖలు చేశారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.
బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో పుంజుకున్నాయి. అయితే.. కేవలం సీట్లలోనే కాకుండా.. ఆయా అభ్యర్థు లు భారీ మెజారిటీల్లోనూ దూసుకుపోయారు. అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అభ్యర్థులు లక్షల సంఖ్యలో ఓట్లు రాబట్టుకున్నారు. ఏపీలో అసలు ఏమీలేదని అనుకున్న బీజేపీ కూటమి కట్టడంతో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులు పార్లమెంటు స్థానాల్లో భారీ మెజారిటీ పోగేసుకున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. అసలు గెలుస్తారా? అని అనుకున్న సమయంలో ఆమె ఏకంగా 2.2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ తో గెలుపు గుర్రం ఎక్కారు.
ఇక, గుంటూరు నుంచి బరిలో నిలిచి గెలిచిన టీడీపీ అభ్యర్థి , ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్.. 3,44,695 ఓట్లు మెజారిటీ దక్కించుకున్నారు. అమలాపురం నుంచి తొలి విజయం దక్కించుకున్న గంటి హరీష్ 3,42,196 ఓట్ల మెజారిటీ సాధించారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడోసారి విజయం దక్కించుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు 3,27,901 ఓట్లు మెజారిటీ పొందారు. అలాగే.. విశాఖ నుంచి బరిలో ఉన్న టీడీపీ యువ నేత, బాలయ్య రెండో అల్లుడు శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీ సాధించారు.
తెలంగాణ విషయానికి వస్తే.. నల్లగొండ నుంచి బరిలో నిలిచిన యువ నాయకుడు..కుందూరు రఘువీర్ 5,59,905 ఓట్లు మెజారిటీ పొందారు. ఖమ్మం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి 4,67,847 ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. మహబూబా బాద్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్.. 349165 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. హైదరాబాద్ నుంచి వరుస విజయాలు దక్కించుకున్న అసదుద్దీన్ ఒవైసీ 338087 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.