ఇంకో 2 డిగ్రీలు అంతే.. వడదెబ్బ.. గుండెపోట్లతో దెబ్బలే దెబ్బలట

తాజాగా అలాంటి హెచ్చరిక వచ్చేసింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజాగా విడుదల చేసిన నివేదికలోని వివరాల్ని చదివితే గుండె గుభేల్ మనక మానదు.

Update: 2023-10-16 04:10 GMT

తప్పులు చేసే మనుషులకు ప్రకృతి విధించే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. అందరూ తప్పులు చేయకపోవచ్చు. కొందరి కక్కుర్తి.. అందరికి పెను సవాలుగా మారుతుంటుంది. తాజాగా అలాంటి హెచ్చరిక వచ్చేసింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజాగా విడుదల చేసిన నివేదికలోని వివరాల్ని చదివితే గుండె గుభేల్ మనక మానదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగితే.. జరిగే నష్ట తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా పేర్కొంది.

ఇప్పుడున్న ఉష్ణోగ్రతలకు మరో 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిన పక్షంలో ఉత్తర భారత్ తో సహా తూర్పు పాకిస్థాన్ లోని కోట్లాది మంది ప్రజలు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరో 2 డిగ్రీల ఉష్ణోగ్రతల పెరుగుదలతో దగ్గర దగ్గర 220 కోట్ల మంది ప్రజల మీద ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించింది.

ఈ తీవ్రమైన వేడి కారణంగా వడదెబ్బ.. గుండెపోటు ముప్పు పొంచి ఉంటుందని.. అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని వార్నింగ్ ఇచ్చింది.

ఈ వేడి వాతావరణం కారణంగా.. మనుషులు తమ శరీరాన్ని సహజసిద్ధంగా చల్లబర్చుకునే వీలు ఉండదని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల్లో ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగినా.. కోట్లాది మంది తీవ్రమైన వేడి.. గాల్లో అధిక తేమతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఇదంతా కూడా పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు.

ఎవరికి వారు బాధ్యతగా ఉండటం ద్వారానే ముప్పును ఎదుర్కొనే వీలుంది. లేదంటే.. అంతకంతకూ మూల్యం చెల్లించక తప్పదు.

Tags:    

Similar News