స్కూల్లో ఘోర అగ్నిప్రమాదం... 13 మంది మృతి!
పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది విద్యార్థులు మరణించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది విద్యార్థులు మరణించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 13మంది మరణించగా.. ఒక్కరు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులు ధృవీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన కేసులో పాఠశాల హెడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంతో ఆ పరిశారలన్నీ హాహాకారాలతో నిండిపోయాయి.
అవును... సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లోని పాఠశాల డార్మిటరీ అగ్నిప్రమాదంలో 13 మంది మరణించినట్లు అధికారిక జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. హెనాన్ లోని యన్ షాన్ పు గ్రామంలోని యింగ్ కాయ్ స్కూల్లో శుక్రవారం రాత్రి 11 గంటలకు మంటలు చెలరేగాయని.. ఈ విషయాన్ని స్థానిక అగ్నిమాపక విభాగానికి నివేదించిందని స్థానిక మీడియా వెల్లడించింది
ఇక ఈ విషయాలపై మరిన్ని విషయాలు వెల్లడించిన స్థానిక మీడియా... అగ్నిమాపక సిబ్బంది త్వరగా సంఘటనా స్థలానికి చేరుకున్నారని, ఫలితంగా రాత్రి 11:38 గంటలకు మంటలను ఆర్పివేశారని తెలిపింది. ఇదే సమయంలో... గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగా ఉందని నివేదించింది.
భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. చైనాలో ఇలా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఆ ప్రమాణాలను సరిగా అమలు చేయకపోవడం వల్ల అగ్నిప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ లో ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లోని బొగ్గు కంపెనీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 26 మంది మరణించారు.
ఇదే సమయంలో గత ఏడాది జూలైలో.. ఈశాన్య ప్రాంతంలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోవడంతో 11 మంది మరణించారు. దానికి ఒక నెల ముందు.. వాయువ్య చైనాలోని బార్బెక్యూ రెస్టారెంట్ లో పేలుడు సంభవించి 31 మంది మరణించారు. ఇక ఏప్రిల్ లో.. బీజింగ్ లోని ఒక ఆసుపత్రి అగ్నిప్రమాదంలో 29 మంది మరణించారు. ఇలా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల చైనాలో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి!