అంతమే పంతం.. ఉగ్రవాదుల కోసం ప్రపంచం జల్లెడ

ఇజ్రాయెల్ అంటే టెక్నాలజీ.. రక్షణ రంగంలో మేటి.. వ్యవసాయంలో కొత్త పద్ధతులకు పేరుగాంచింది. అలాంటి ఇజ్రాయెల్ దాదాపు రెండు నెలలుగా హమాస్ తో యుద్ధం చేస్తోంది.

Update: 2023-12-02 12:28 GMT

తమకు వీసమెత్తు హాని చేసినా వారిని వదలిపెట్టదు ఆ దేశం.. తమ దేశానికి భవిష్యత్ లో ఏమాత్రం భద్రతా ముప్పుందని తెలిసినా విస్మరించదు ఆ దేశం.. తమ జాతీయులకు ఎక్కడ ఆపద వాటిల్లినా ప్రపంచాన్ని ఎదిరించైనా చర్యలకు దిగుతుంది. చుట్టూ శత్రు దేశాలున్నప్పటికీ 75 ఏళ్లుగా ఉనికిని కాపాడుకుంటూ వాటికి సింహ స్వప్నంగా నిలవడం అంటే మామూలు వాళ్లకు సాధ్యం కాదు. కానీ, ఆ దేశానికి సాధ్యమైంది.

వెంటాడుతూ.. వేటాడుతూ..

ఇజ్రాయెల్ అంటే టెక్నాలజీ.. రక్షణ రంగంలో మేటి.. వ్యవసాయంలో కొత్త పద్ధతులకు పేరుగాంచింది. అలాంటి ఇజ్రాయెల్ దాదాపు రెండు నెలలుగా హమాస్ తో యుద్ధం చేస్తోంది. అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన విచక్షణా రహిత దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా సాగుతోంది. వాస్తవానికి దీనికిముందు వరకు వెస్ట్ బ్యాంక్ లో అడపాదడపా ఉద్రిక్తతలు తలెత్తాయి. కానీ, అనుకోకుండా గాజా నుంచి దాడికి గురైంది ఇజ్రాయెల్. ఇక అప్పటినుంచి గాజా (ముఖ్యంగా ఉత్తర గాజా)ను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇందులో భాగంగా హమాస్ ఉగ్ర సంస్థ పెద్ద తలకాయలను ఒక్కొక్కటిగా ఏరివేస్తోంది.

ప్రపంచంలో ఎక్కడ నక్కినా..

ట్రాక్.. హంట్.. కిల్.. ఇప్పుడు ఇజ్రాయెల్ నినాదం ఇదే. ప్రపంచంలో హమాస్ ఉగ్ర పెద్దలు ఎక్కడ నక్కినా వారిని వెంటాడి వేటాడాలని చూస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ మంతి.. రెండు రోజుల కిందట అమెరికాకు ఇదే విషయం స్పష్టం చేశాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్‌ నెతన్యాహు గతంలో తమ ప్రధాని గోల్డా మెయిర్ చూపిన బాటలో నడవనున్నారట. మెయిర్.. ప్రపంచంలో ఉన్న ఇజ్రాయెల్‌ శత్రువులను అంతం చేసేందుకు ‘ఆపరేషన్‌ రేత్‌ ఆఫ్‌ గాడ్‌’ చేపట్టారు. నెతన్యాహు కూడా.. వివిధ దేశాల్లో ఉన్న హమాస్‌ కీలక నేతలను ఏరివేసేలా తమ నిఘా సంస్థ మొసాద్‌ కు ఆదేశాలిచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు మొసాద్‌ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. హమాస్ కీలక నేతలు ఎవరు? ఏయే దేశాల్లో ఉంటున్నారు? అనే వివరాలు నెతన్యాహు దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది.

ఇతర దేశాల్లోని వారిని హతమార్చితే..?

హమాస్ కీలక నేతలు తుర్కియే, లెబనాన్‌, ఖతర్‌ లలో ఉంటారు. అక్కడినుంచే కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఇప్పుడు వారికోసం ట్రాక్‌.. హంట్‌.. కిల్‌..మొదలుపెడితే ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. వీరిలో ముఖ్యులు ఇస్మాయిల్ హనియే. గతంలో పాలస్తీనా ప్రధాని ఆయన. 2017లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్. 2006లో ఓసారి విషపు లేఖ ద్వారా ఈయనపై హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు ఖతర్-తుర్కియే మధ్య ఉంటున్న ఇతడు హమాస్ కార్యక్రమాల్లో లేరు. కానీ, ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డెయిఫ్ ను చంపేందుకు ఇజ్రాయెల్ ఆరుసార్లు విఫలమైంది. రెండు నెలల కిందట మొదలైన దాడుల సూత్రధాని ఇతడేనని భావిస్తోంది. గాజాలోనే ఉన్నాడని భావించి హతమార్చాలని చూస్తోంది. 61 ఏళ్ల యహ్యా సిన్వార్‌.. హమాస్‌ మిలటరీ విభాగం బ్రిగేడ్స్‌ కమాండర్‌. 23 ఏళ్లకు పైగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్నాడు ఇతడు. ఫ్రాన్స్‌-ఇజ్రాయెల్‌ సైనికుడిని అపహరించిన హమాస్‌ ఉగ్రవాదులు.. అతడిని అప్పగించాలంటే సిన్వార్‌ ను విడుదల చేయాలని డిమాండ్‌ చేసి సాధించుకున్నారు. మరొకరు ఖలేద్‌ మషల్‌.. హమాస్‌ పొలిట్‌బ్యూరో వ్యవస్థాపక సభ్యుడితడు. ఖతర్‌ లో ఉంటున్నాడని భావిస్తున్నారు. ఇతడిపై 1997లో జోర్డాన్‌ వెళ్లి మరీ మొసాద్‌ దాడి చేసింది. కెనడా టూరిస్టుల్లాగా వెళ్లి.. ఖలేద్ కళ్లల్లోకి ప్రమాదకరమైన స్ప్రే కొట్టారు. కోమాలోకి వెళ్లిన అతడిని కిడ్నాప్‌ చేసిన మొసాద్‌ ఏజెంట్లు రహస్య ప్రదేశంలో బంధించారు. కానీ, అమెరికా అప్పటి అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ జోక్యం చేసుకోవడంతో.. మొసాద్‌ చీఫ్‌ డానీ దిగివచ్చారు. కోమాకు విరుగుడు మందుతో జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ కు వెళ్లి ఖలేద్ కు చికిత్స అందేలా చూశారు. ఇప్పుడు ఖలేద్ ఇజ్రాయెల్ కు మరోసారి టార్గెట్ అయ్యాడు.

Tags:    

Similar News