వరదలు తెచ్చిన నష్టం.. ఏం మిగల్లేదు కదా..!

పెద్దపెద్ద బిల్డింగులు సైతం వరదల్లో కనిపించకుండా మునిగిపోయాయి.

Update: 2024-09-04 10:30 GMT

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. నిద్రలో నుంచి లేచే లోపే రాత్రికిరాత్రే ఇండ్లన్నీ వరదల్లో మునిగిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు.. పది కాదు.. ఇరవై కాదు.. వందలాది ఇండ్లు జలవలయంలో చిక్కుకుపోయాయి. పెద్దపెద్ద బిల్డింగులు సైతం వరదల్లో కనిపించకుండా మునిగిపోయాయి. బడా అపార్ట్‌మెంట్లు సైతం సగానికి పైగా ఎత్తులో నీటిలో కనిపించకుండా పోయాయి.

అంతటి వరదల్లో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడమే గగనంలా మారింది. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలారు. ఇళ్లలోని సామగ్రి అంతా అలాగే ఉండిపోయింది. చివరకు ఆహారం కోసం కూడా అల్లాడిపోతున్నారు. ఇప్పటికీ ఇంకా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో ఇళ్లకు వెళ్లలేక బయటే తలదాచుకుంటున్నారు. సహాయం చేసే వారి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన ఆహార పొట్లాలను తినేస్తున్నారు. పంపిణీ చేస్తున్న నీళ్లనే తాగుతున్నారు. ఫంక్షన్ హాళ్లలో, స్కూళ్లలో ఆశ్రయం పొందుతున్నారు.

ఊహించకుండా సంభవించిన ఈ వరదలో ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. చాలా పేద కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయాయి. ఎన్నో కుటుంబాలు ఈఎంఐలు పెట్టి ఫ్రిడ్జిలు, గ్రాండర్లు, వాషింగ్ మెషిన్లు తదితర సామగ్రి కొనుగోలు చేశారు. ఇంకా వాటికి ఈఎంఐలు కడుతూనే ఉన్నారు. కానీ.. ఇప్పుడు ఆ వస్తువులన్నీ బురదమయం అయ్యాయి. వరదలో ఎటు కొట్టుకుపోయాయో కూడా తెలియని పరిస్థితి. ఒక్కో ఫ్యామిలీ రూ.50వేల నుంచి ఐదు లక్షలకు పైగానే నష్టపోయింది.

మరికొందరికి సంబంధించి డబ్బులు వరదలో కొట్టుకుపోయాయి. సర్టిఫికెట్లు పోయాయి. విలువైన డాక్యుమెంట్లు కోల్పోయారు. ఇప్పుడు వాటిని గుర్తుచేసుకుంటూ కుటుంబాలు బాధపడుతున్నాయి. సగటు ఉద్యోగులు ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన వస్తువులు వరదపాలు కావడంతో తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ జీవితాన్ని మొదటి నుంచి మొదలు పెట్టే దుస్థితి వచ్చిందని రోదిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News