సీఎం కానీ మాజీ సీఎం కానీ వస్తేనే బయటకొస్తా.. దొంగ కండీషన్

తన చేష్టలతో పోలీసులకు చుక్కలు చూపించిన ఈ దొంగ వ్యవహారం సంచలనంగా మారింది.

Update: 2023-12-16 04:21 GMT

చోరీకి వెళ్లిన ఒక దొంగ.. చోరీ చేసే వేళ ఇంటి యజమాని రావటంతో ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి దూకేశాడు. దాని మధ్యనున్న బండ మీద ఉండిపోయాడు.బయటకు రావాలని పోలీసులు అడిగితే.. తాను రానంటే రానని.. బయటకు వస్తే పోలీసులు కొడతాడని చెబుతున్నాడు. కొట్టమని అంటే.. సీఎం కానీ మాజీ సీఎం కానీ వస్తేనే బయటకు వస్తానంటూ కండీషన్ పెట్టిన సిత్రమైన ఉదంతం హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకుంది. తన చేష్టలతో పోలీసులకు చుక్కలు చూపించిన ఈ దొంగ వ్యవహారం సంచలనంగా మారింది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నందు..నాగలక్ష్మి దంపతులు ఉన్నారు. శుక్రవారం వీరి ఇంటికి తాళం వేసి ఒక ఫంక్షన్ కు వెళ్లారు. సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో వారి రెండో కుమార్తె సాయి జ్యోతి ఇంటికి వచ్చేసరికి.. గేటుకు తాళం వేసి ఉన్నా.. ఇంటి తలుపులు తీసి ఉండటంతో అనుమానం వచ్చి లోపలకు వెళ్లింది. ఇంట్లోని బెడ్రూంలో ఒక వ్యక్తి కూర్చొని డబ్బులు లెక్కేస్తున్న వైనం చూసిన అమ్మాయి.. దొంగ.. దొంగ అంటూ పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగు తీసింది.

దీంతో.. చుట్టుపక్కల వారు ఇంట్లో నుంచి తప్పించుకుంటుండగా.. స్థానికులు వెంబడించారు. దీంతో పెద్ద చెరువులోకి దిగిన అతను ఒక బండరాయి మీద కూర్చున్నాడు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు. చెరువులో నుంచి బయటకు రావాలని పిలిస్తే.. తాను బయటకు రానని.. వస్తే కొడతారంటూ చెబుతూ.. బయటకు వచ్చేందుకు ససేమిరా అన్న పరిస్థితి.

తాము కొట్టమని పోలీసులు ఎంత చెప్పినా.. వినలేదు. తాను బయటకు రావాలంటే ముఖ్యమంత్రి కానీ మాజీ సీఎం కానీ వస్తేనే చెరువులో నుంచి బయటకు వస్తానంటూ కండీషన్ పెట్టసాగాడు. పోలీసుల సహనానికి పరీక్ష పెట్టాడు. పోలీసులు మైకులో అతడ్ని బయటకు రావాలని చెప్పినా రాలేదు. అర్థరాత్రి ఒంటి గంట వరకు హైడ్రామా సాగింది. అతను చెరువు మధ్య రాయి మీదనే కూర్చున్నాడు. ఈ ఉదయం అతన్ని పట్టుకునే వీలుందని చెబుతున్నారు. మరోవైపు.. రూ.20 వేల మొత్తాన్ని దొంగ దోచుకెళ్లాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

Tags:    

Similar News