‘ఓటెత్తిన’ భారతం.. 64.2 కోట్లమంది.. జీ-7 దేశాల జనాభా కంటే ఒకటిన్న రెట్లు!
ఇక మన జనాభా ఈ ఏడాదిలోనే 150 కోట్లు దాటిన సంగతి తెలిసిందే.
అప్పుడెప్పుడో 1951-52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు నాలుగు నెలల పాటు సాగాయి.. మళ్లీ ఆ తర్వాత అత్యంత సుదీర్ఘంగా 44 రోజులు నడిచాయి తాజా ఎన్నికలు. షెడ్యూల్ విడుదల నుంచి పోల్చుకుంటే మొత్తం 81 రోజుల పాటు సాగింది ఎన్నికల ప్రక్రియ. తొలి ఎన్నికలను మినహాయిస్తే వీటిని రికార్డు కిందనే పరిగణించాలి. ఇక మన జనాభా ఈ ఏడాదిలోనే 150 కోట్లు దాటిన సంగతి తెలిసిందే. అనధికారికంగా చైనా కంటై మన జనాభానే అధికం.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తొలి దశ ఏప్రిల్ 19న మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న నాలుగో విడత జరిగింది. ఇందులోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాగా, ఇప్పుడు అందరి చూపు మంగళవారం నాటి ఎన్నికల ఫలితాల పైనే ఉంది. వీటికోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
భారీగా ఓటింగ్.. ప్రత్యేక సమావేశం
ఎన్నికల ప్రక్రియ ముగింపు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం మీడియా సమావేశం నిర్వహించింది. 75 ఏళ్ల భారత ఎన్నికల చరిత్రలో ఎన్నికల ముగింపుపై ఈసీ ఇలా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ దిగ్విజయంగా ముగిసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో 64.2 కోట్ల మంది ఓటు వేశారని ఇది ప్రపంచ రికార్డని కూడా వెల్లడించారు.
జీ-7 దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే ఇది ఒకటిన్నర రెట్లు ఎక్కువని.. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువని పేర్కొన్నారు.
మహిళా ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్
తాజా ఎన్నికల్లో మహిళా ఓటర్లు 31.2 కోట్ల మంది హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ సభ్యులు మహిళా ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కాగా, ఏడు దశల ఎన్నికల కోసం కోటిన్నర మంది పోలింగ్, సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. 68,763 బృందాలు ఎన్నికలను పర్యవేక్షించాయి. 135 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4లక్షల వాహనాలను ఉపయోగించారు.
· 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీ పోలింగ్ అవసరం రాలేదు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా.. ఈసారి 39 చోట్ల మాత్రమే. ఇందులోని 25 ప్రదేశాలు రెండు రాష్ట్రాల్లోనివే.
· నాలుగు దశాబ్దాలతో పోలిస్తే కశ్మీర్ లో అత్యధిక ఓటింగ్ (58.58 శాతం) నమోదైంది. ఉగ్రవాదాని కేంద్రమైన కశ్మీర్ లోయలో 51.05 శాతం పోలింగ్ జరగడం విశేషం.
· రూ.10వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్, మద్యాన్ని ఎన్నికల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. 2019 కంటే ఇది మూడు రెట్లు కావడం విశేషం. సీ-విజిల్ యాప్ లో 4.56 లక్షల ఫిర్యాదులు రాగా 99.9 శాతం పరిష్కరించారు. 87.5 శాతం ఫిర్యాదులకు 100 నిమిషాల్లోపే పరిష్కారం చూపారు. డీప్ ఫేక్ వీడియోలను నిలువరించారు.