పోలవరం...ఇంకా ఎంత దూరం ?
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తన కమిట్ మెంట్ ఏంటి అన్నది ఆయన అయిదు కోట్ల ఆంధ్రులకు ఆ విధంగా తెలియచేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు. అక్కడే అధికారులతో సమీక్ష చేశారు. మీడియాను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తన కమిట్ మెంట్ ఏంటి అన్నది ఆయన అయిదు కోట్ల ఆంధ్రులకు ఆ విధంగా తెలియచేశారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అధికారులు తనకు చెప్పింది ఏంటి అన్నది బాబు వివరించారు. ఏకంగా నాలుగేళ్ల కాలం పట్టవచ్చు అన్నది అధికారులు చెప్పారని బాబు ఒక చేదు వార్తనే మీడియా ముందు ఉంచారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తప్పిదాలు చాలా జరిగాయి. డయాఫ్రం వాల్ 2020లో వచ్చిన గోదావరి వరదలకు కొట్టుకుని పోయింది. దీని మీదనే ఇపుడు చర్చ సాగుతోంది.
డయాఫ్రం వాల్ ని తిరిగి నిర్మించాలా లేక దానికి పక్కనే మరో వాల్ కట్టి పటిష్టం చేయాలా లేక దానికి బీటలు వాలిన చోట్ల మరమ్మత్తులు చేసి ముందుకు సాగాలా అన్న దాని మీద జాతీయ అంతర్జాతీయ జలవనరుల సాంకేతిక నిపుణులు కూడా ఒక్క మాట మీదకు రాలేకపోతున్నారు. నాలుగేళ్లుగా వైసీపీ ఇదే విషయం చెబుతూ చివరికి ఎన్నికల్లో ఓటమితో ఇంటి బాట పట్టింది.
ఇపుడు ఈ భారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పడింది. ఏమి చేస్తే బాగుంటుంది అన్నదే ఇపుడు చర్చ సాగుతోంది. తీసుకున్న నిర్ణయం కచ్చితమైనది అయి ఉండాలి. లేకపోతే ఈ బహులార్ధక సాధక ప్రాజెక్ట్ వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. మరి మరమ్మత్తులతో సరిపెడితే ప్రాజెక్ట్ కే పెను ముప్పు అన్న మాటా ఉంది.
ఇక డయాఫ్రం వాల్ ని తిరిగి నిర్మిస్తే ఎంత ఖర్చు అన్నది కూడా చర్చగా ఉంది. ఆరు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల దాకా అని చెబుతున్నారు. ఈ మొత్తం ఎవరు చెల్లించాలి అన్నది కూడా ప్రశ్న. కేంద్రం అయితే గత పదేళ్ళుగా పోలవరం ప్రాజెక్టుకు రీ ఇంబర్స్ మెంట్ కింద ఇచ్చినది పదిహేను వేల కోట్ల దాకానే అని అంటున్నారు. 2014 నాటి అంచనాలకే కేంద్రం కట్టుబడి ఉంది. ఆ మీదట ఒక్క పైసా ఇచ్చేందుకు సిద్ధంగా లేదని అంటున్నారు.
ఇక 2018 నాటికే సవరించిన అంచనాలు కలుపుకుంటే 56 వేల కోట్ల దాకా అయింది. ఈలోగా డయాఫ్రం వాల్ సమస్య వచ్చింది. ఈ మొత్తాన్ని కూడా కేంద్రం భరించదు అనే అంటున్నారు. మరో వైపు ఇంకోసారి పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను సవరించాల్సి రావచ్చు అని అంటున్నారు. అదే జరిగితే ఏ డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలకే వెళ్తుంది.
మరి కేంద్రం అంత మొత్తం ఇస్తుందా అన్నది ప్రధాన ప్రశ్నగా ఉంది. అదే టైం లో ముందు ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటే ఆనక అన్నీ చూసుకుని తాపీగా కేంద్రం రీ ఇంబర్స్ మెంట్ కింద నిధులను తోచిన తీరున విడుదల చేస్తుంది. ఈ విధానం వల్ల భారం అంతా ఏపీ సర్కార్ దే అవుతుంది. ఈ నేపధ్యంలో నిపుణుల నుంచి మేధావుల వరకూ అనే మాట కానీ ఇచ్చే సలహా కానీ ఒక్కటే ఉంది.
అదేంటి అంటే పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. ఏ రోజుకు అయినా దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. అందువల్ల ఇపుడైనా దాన్ని కేంద్రానికే అప్పగిస్తే మేలు అని అంటున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న నాలుగేళ్ల కాలపరిమితికి మరో నాలుగేళ్ళు వేసుకున్నా ఎప్పటికో నాటికి పోలవరం పూర్తి అవుతుంది అని అంటున్నారు.
అలా కాకుండా ఏపీ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటే మాత్రం అది పూర్తికి కాలం మరింతగా కరిగిపోతుంది ఈలోగా లక్ష కోట్లకు కూడా ఖర్చు సవరించిన అంచనాల రూపంలో ఎగబాకవచ్చు అని అంటున్నారు. మరి చూడాలి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో. ఏది ఏమైనా పోలవరం సందర్శన అనంతరం చంద్రబాబు చాలా ఆవేదనతో మాట్లాడడం జరిగింది. దానిని కనుక అర్ధం చేసుకుంటే పోలవరం చాలా దూరం అని మాత్రం ఎవరికైనా బోధపడుతుంది అని అంటున్నారు.