అమెరికాలోలాగా.. మన దగ్గరా అందరికీ బీమా.. ఎప్పటినుంచి అంటే..?
అయితే, ఎంత ప్రభుత్వమైనా అన్ని వ్యాధులకూ ఉచితంగా సేవలు అందించలేదు కదా..?
జీవిత బీమా.. ఒక్కసారి ఆస్పత్రి పాలై రూ.లక్షలు ఖర్చయితే కానీ తెలియదు.. దీని అవసరం ఏమిటో..? శారీరక అనారోగ్యానికి ఆర్థిక అనారోగ్యమూ తోడైతే ఆ కుటుంబం లేదా వ్యక్తి పరిస్థితి చెప్పనలవి కాదు.. ఇలాంటి సమయంలోనే జీవిత బీమా కొండంత అండగా నిలుస్తుంది. కానీ, భారత దేశంలో ఇప్పటికీ అందరికీ బీమా లేదు. అందుకనే ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ వంటి పథకాలను తీసుకొస్తున్నాయి. అయితే, ఎంత ప్రభుత్వమైనా అన్ని వ్యాధులకూ ఉచితంగా సేవలు అందించలేదు కదా..?
ఆదర్శం అందరికీ బీమా
ఆరోగ్య బీమా అనేది పూర్తిగా వ్యక్తుల ఇష్టం. కానీ, ఓ అభిప్రాయం ప్రకారం అయితే.. అందరూ కచ్చితంగా బీమా తీసుకోవాలి. ఈ కోణంలోనే అందరూ బీమా కలిగి ఉండేలా బీమా చట్టం-1938లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అయ్యే 2047 నాటికి అందరికీ బీమా అందించడమే దీని లక్ష్యం. ఈ మేరకు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టొచ్చని సమాచారం. ఈ బిల్లులో బ్యాంకింగ్ సహా పలు ఆర్థిక రంగాల్లో మార్పులు తేనున్నారు. ఇదే తరహాలో బీమా చట్టంలోనూ మార్పులు ఉండనున్నాయి. అదే జరిగితే.. బీమా రంగంలో ‘విభిన్న రకాల కంపెనీ’లు ప్రవేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు కాంపోజిట్ లైసెన్సుల వల్ల జీవిత బీమా సంస్థలు ఆరోగ్య లేదా సాధారణ బీమా పాలసీలు విక్రయించేందుకు అనుమతి లభిస్తుంది. బీమా చట్టం-1938 ప్రకారం జీవిత బీమా సంస్థలు జీవిత బీమా పాలసీలకే పరిమితం కావాలి. సాధారణ బీమా సంస్థలు ఆరోగ్య, వాహన, అగ్ని, సముద్ర.. తదితర జీవిత బీమాయేతర ఉత్పత్తులను విక్రయించాలి.
సవరణల బిల్లు ముసాయిదా సిద్ధం..
సవరణలతో బీమా ముసాయిదా బిల్లు సిద్ధంగా ఉంది. దీనికి క్యాబినెట్ ఆమోదం లభించాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాల్లో కచ్చితంగా సభ ముందుకు వస్తుందని ఆర్థిక శాఖ ధీమాతో ఉంది. కొత్తగా తెస్తున్న సవరణలతో ప్రాథమికంగా పాలసీదారుల ప్రయోజనాలు, రాబడి మెరుగుపడి.. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు అవకాశం ఉందని బీమారంగ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాక.. బీమా రంగంలో కొత్త సంస్థలు ప్రవేశించడంతో పోటీ పెరిగి పాలసీల ధరలు తగ్గుతాయి. అటు బీమా సంస్థలకూ వ్యాపార నిర్వహణ సులభం అవుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ 2022 డిసెంబరులోనే బీమా చట్టం, ఐఆర్‌డీఏ-1999 చట్టాల్లో సవరణలపై సూచనలు కోరింది. కాగా, ప్రస్తుతం దేశం 25 జీవిత, 32 సాధారణ బీమా సంస్థలు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ బీమా అందించే (అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్), ఈసీజీసీ లిమిటెడ్ కూడా భాగమే.