ఏపీలో సైలెంట్ వేవ్...ఎవరూ కనిపెట్టలేకపోయారే !
ఓటరుని ఇంటి నుంచి పోలింగ్ బూత్ దాకా కదిలించే శక్తి పార్టీలకు కానీ వారి మ్యానిఫేస్టోలకు కానీ లేదు అని కూడా తలపోశారు.
ఈసారి ఎన్నికల్లో వేవ్ అన్నది కనిపించడం లేదు అని అంతా విశ్లేషించుకుని వచ్చారు. ఓటరు నిరాసక్తంగా ఉన్నారని ఎవరి అంచనాలు వారు వేసుకున్నారు. ఇక ఏపీలో భావోద్వేగమైన అంశాలు ఈసారి ఎన్నికల ప్రచారంలో లేవని కూడా భావించారు. ఓటరుని ఇంటి నుంచి పోలింగ్ బూత్ దాకా కదిలించే శక్తి పార్టీలకు కానీ వారి మ్యానిఫేస్టోలకు కానీ లేదు అని కూడా తలపోశారు.
కానీ బిగ్ డే అయిన పొలైంగ్ రోజున ఓటరు బయటకు వచ్చాడు. సూర్యోదయం కాక ముందే పోలింగ్ బూత్ కి చేరుకున్నాడు. ఓటు వేసి తీరాలని పట్టుబట్టి మరీ క్యూ కట్టాడు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా కసిగా నిలిచాడు. అది రికార్డు స్థాయి పోలింగ్ శాతాన్ని నమోదు చేసే దిశగా సాగింది. ఇలా చూసినపుడు ఒక సైలెంట్ వేవ్ అన్నది ఏపీలో ఉంది అన్నది అర్ధం అవుతోంది.
దాన్ని పసిగట్టి పట్టుకోలేని పరిస్థితిలో మాత్రమే పార్టీలు కానీ విశ్లేషకులు కానీ ఉన్నారని అంటున్నారు. బ్రహ్మాండమైన వేవ్ ఒకటి వీచింది. అది ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా అది బలంగా వీచింది. ఆ వేవ్ ఎవరి వైపు అన్నది ఇపుడు నిలువెత్తు ప్రశ్న.
ఇంతటి వేవ్ కనుక వస్తే అది ఏకపక్ష తీర్పునకు కారణం అవుతుంది అని గత అనుభవాలను గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలూ నిరూపించాయి. ఏపీలో చూస్తే కనుక ఈ సైలెంట్ వేవ్ ఏ పార్టీని కిల్ చేస్తుంది, ఏ పార్టీని అందలం ఎక్కిస్తుంది అన్నది తేలడం లేదు.
రాజకీయ పార్టీలకు ఇదే ఇపుడు చిక్కు ముడి వీడని ప్రశ్నగా మారుతోంది. ఇక చాలా మంది మీడియాతో మాట్లాడినా టీవీ డిబేట్లలో మాట్లాడినా ఒక మాట అంటున్నారు. నెక్ టూ నెక్ అన్నట్లుగా ఏపీలో ఉంది. ఫలితాలు అలాగే వస్తాయని. కానీ చూస్తూంటే వార్ వన్ సైడ్ అయినట్లుగానే పోలింగ్ సరళి చెబుతోంది.
ఆ వన్ సైడ్ ఏ వైపు తీసుకుంది. ఏ పార్టీని దగ్గరకు తీసుకుంది అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్నగా ముందుకు వస్తోంది. వార్ వన్ సైడ్ కనుక తీసుకుంటే మాత్రం అధికారంలోకి వచ్చే పార్టీకి కచ్చితంగా 130 నుంచి 140 దాకా సీట్లు చాలా ఈజీగా వస్తాయని అంటున్నారు.
దానికి 2019 ఎన్నికల ఫలితాలను ఉదహరిస్తున్నారు. అపుడు కూడా బలమైన వేవ్ వీచింది. అది వైసీపీకి అనుకూలంగా మారింది. దాంతో 151 సీట్లతో వైసీపీ నెగ్గింది. ఈసారి చూస్తే కనుక అలాంటి వేవ్ మరోటి వీచింది. మరి అది ఎవరి వైపు అన్నదే చర్చ. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీల సైడే వేవ్ ఉంటుంది అన్నది ఒక సహజమైన రాజకీయ పరిణామం.
అధికారంలో ఉన్న పార్టీ మీద యాంటీ ఇంకెంబెన్సీ ఎంతో కొంత ఉంటుంది. ఒక వేళ కంటిన్యూ చేయాలని అనుకున్నా బొటా బొటీ సీట్లతో సరిపెడతారు అది 2009లో వైఎస్సార్ సెకండ్ టెర్మ్ విజయంతో కనిపించిన వాస్తవం. అందువల్ల వేవ్ బలంగా అయితే ఉండదు. ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటే పోలింగ్ స్టేషన్లు కిటకిటలాడవు అని కూడా అంటున్నారు.
సో అలా ఆలోచిస్తే విపక్ష టీడీపీ కూటమి వైపు బలమైన వేవ్ సాగింది అని ఒక విశ్లేషణ. అంటే 2014 నాటి రిజల్ట్ రిపీట్ అవుతోంది అని కూడా దీనిని బట్టి ఒక అంచనాకు వస్తున్నారు. అయితే పాజిటివ్ వేవ్ మాకు ఉంది అని వైసీపీ అంటోంది. అది ఒక బలమైన తీర్పు రూపంలో వస్తోంది అని కొన్ని సెక్షన్లు పోలింగ్ బూతుల ముందు కనిపించడాన్ని ప్రస్తావిస్తోంది. అయితే ఏపీలో ఒక సందర్భంలో మాత్రమే వరసగా బలమైన వేవ్ వీచి ప్రభుత్వానికి భారీ సీట్లు దక్కాయి.
అది టీడీపీ 1983లో పోటీ చేసి గెలిచినపుడు. అలాగే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల సందర్భంలోనూ జరిగింది. ఆ తరువాత వరసగా రెండు బలమైన వేవ్ లని క్రియేట్ చేసే సందర్భం అయితే గత నలభై ఏళ్ళలో ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ ఎక్కడా జరగలేదు. సో ఈసారి అలా జరిగితే మాత్రం వైసీపీదే అద్భుతమైన విజయం. అయితే అలా జరిగే అవకాశాలు అరుదు అని అంటున్నారు కాబట్టి కూటమి వైపు వేవ్ వీచింది అని అనుకోవచ్చా అంటే వెయిట్ అండ్ సీ.