వైసీపీ ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ రెడీ ...!?

కొన్ని చోట్ల మంత్రులు, మాజీ మంత్రులు కూడా బరిలో నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2024-01-26 15:11 GMT

వైసీపీ ఎమ్మెల్యేల మార్పు చేర్పులతో పాటు ఎంపీ అభ్యర్ధుల జాబితాను కూడా రెడీ చేస్తోంది. వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్ధులు ఎవరు అన్నది చూస్తే కనుక పలు చోట్ల ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మంత్రులు, మాజీ మంత్రులు కూడా బరిలో నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శ్రీకాకుళం నుంచి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్ధిగా పేడాడ తిలక్, విజయనగరం నుంచి మజ్జి శ్రీనివాసరావు, విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి, అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అమరనాథ్, అరకు నుంచి పాడేరు ప్రస్తుత ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి పోటీ చేయబోతున్నారు అని తెలుస్తోంది

అదే విధంగా కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్, అమలాపురం నుంచి కొత్త ముఖాన్నే తీసుకుని వస్తారు. అలాగే ఏలూరు నుంచి బీసీని ఈసారి పోటీలోకి దించుతారు అని అంటున్నారు. నర్సాపురం నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన గుబ్బల తమ్మయ్యకు సీటు ఇస్తారని అంటున్నారు. ఇది నిజంగా సామాజిక సమీకరణలో భాగమే అంటున్నారు.

గుంటూరు సీటు కమ్మలకు అలాగే నర్సారావుపేట ఎంపీ సీటుని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి ఇస్తారని అంటున్నారు. ఇక బాపట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే నందిగం సురేష్ ని మార్చి కొత్త వారికే చాన్స్ ఇస్తారని అంటున్నారు.

ఇక విజయవాడ ఎంపీ టికెట్ కి కేశినేని నానికి ప్రకటించేశారు. అనూహ్యంగా మచిలీపట్నం ఎంపీ సీటుకు మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపుతున్నారని అంటున్నారు. ఆయన కుమారుడు మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీలో ఉంటున్నాడు. దాంతో ఎంపీగా పేర్ని నాని రెడీ అవుతున్నారు

నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్ధిగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పోటీకి సిద్ధం అవుతూండగా ఒంగోలు ఎంపీ టికెట్ కి చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరు కొత్తగా వినిపిస్తోంది. తిరుపతి ఎంపీగా ఆదిమూలాన్ని ప్రకటించిన వైసీపీ అధినాయకత్వం తిరుపతి ఎంపీ అభ్యర్ధిగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి బరిలోకి దించుతోంది.

కర్నూల్ ఎంపీగా మేయర్ రామయ్యను దాదాపుగా ఖరారు చేశారు అని తెలుస్తోంది. నంద్యాల టికెట్ ని మైనారిటీలకు ఇస్తారని అంటున్నారు. ఇక్కడ నుంచి టాలీవుడ్ కమెడియన్ అలీని రంగంలోకి దించుతారు అని తెలుస్తోంది. కడప ఎంపీగా సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికే మరోసారి చాన్స్ అని అంటున్నా కాంగ్రెస్ నుంచి వైఎస్ సునీత పోటీకి దిగితే క్యాండిడేట్ మార్పు ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఎంపీ లిస్ట్ దాదాపుగా ఖరారు అయిపోయింది అని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో జాబితా రిలీజ్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.


Tags:    

Similar News