వేములవాడ బీజేపీ లొల్లి వెనుక అసలు సీన్ ఇదేనా?
ఈ కారణంతోనే.. ఆఖరి నిమిషం వరకు అభ్యర్థుల మార్పులుచేర్పులకు కారణమైందని చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రకటనకు సంబంధించి చోటు చేసుకున్న గందరగోళం గతంలో ఎప్పుడూ చోటు చేసుకున్నది లేదు. ఆఖరి నిమిషంలో అనూహ్యమైన మార్పులకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పార్టీలో నెలకొన్న గ్రూపు తగదాలు.. అధిపత్యపోరు అభ్యర్థుల ఎంపికను ప్రభావితం చేశాయని చెబుతున్నారు. ఈ కారణంతోనే.. ఆఖరి నిమిషం వరకు అభ్యర్థుల మార్పులుచేర్పులకు కారణమైందని చెబుతున్నారు. వేములవాడ టికెట్ విషయంలోనూ అదే జరిగినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీలో అగ్రనేతలుగా ఉన్న బండి వర్సెస్ ఈటల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు చివరకు పార్టీ అభ్యర్థిని మార్చటానికి కారణమైనట్లుగా చెబుతున్నారు. తొలుత ఈ టికెట్ ను తన వర్గానికి చెందిన తుల ఉమకు ఈటల రాజేందర్ ఇప్పించుకోగలిగారు. అయితే.. ఈ సీటును మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ కుమారుడు వికాస్ రావు ఆశించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఆయనకు దన్నుగా బండి సంజయ్ నిలిచారు. ఈ క్రమంలో తన కుమారుడి టికెట్ కోసం విద్యాసాగర్ రావు తన పలుకుబడి ఉపయోగించినా ఈటల మాటే నెగ్గిందన్న ప్రచారం జరిగింది.
అయితే.. ఈ వ్యవహారంలోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వటంతో సీన్ మారినట్లుగా చెబుతున్నారు. తుల ఉమకు టికెట్ ఇవ్వటాన్ని నిరసిస్తూ వికాసరావు అనుచరులు హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టటం.. దీనికి ప్రతిగా మహిళలతో తుల ఉమ భారీ ర్యాలీ చేపట్టి నామినేషన్ వేయటం జరిగిపోయాయి. ఈ క్రమంలో వికాస్ రావు సైతం నామినేషన్ వేశారు.
దీంతో.. బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపై గందరగోళం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయానికి వేములవాడ అభ్యర్థి మారిపోయారు. తుల ఉమకు బదులుగా వికాస్ రావుకు పార్టీ బీఫారమ్ ఇవ్వటంతో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వంపై తుల ఉమ నిప్పులు చెరిగారు. దొరలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తుండటంతోనే తనకు టికెట్ రాకుండా చేశారన్న ఆమె.. తాను బరిలోనే ఉంటానని ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ఈటలకు వ్యతిరేకంగా పావులు కదపటంలో బండి తన సత్తా చాటారని చెబుతున్నారు. పార్టీలో తనకున్న పట్టును తాజా పరిణామం చెప్పకనే చెబుతుందంటున్నారు. ఇదిలా ఉంటే.. వేములవాడ ఎపిసోడ్ లో బీజేపీ అధినాయకత్వం ఈటలకు షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో అభ్యర్థిని మార్చటం ఈటలకు ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.