"హిట్ అండ్ రన్" కేసులో అక్కడ మరణశిక్ష విధించే అవకాశం..!
ఇందులో భాగంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో "హిట్ అండ్ రన్" కేసులకు సంబంధించి కఠిన నిబంధనను తీసుకొచ్చింది.
న్యాయ శిక్షాస్మృతుల్లో గణనీయమైన మార్పులతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో "హిట్ అండ్ రన్" కేసులకు సంబంధించి కఠిన నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం... నిర్లక్ష్యంగా వాహనం నడిపి.. వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది!
ఇదే సమయంలో... రెండో నిబంధనలో భాగంగా... రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు జరిగిన ప్రమాదం గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్ కు సమాచారం ఇవ్వకుండా అక్కడ నుంచి పారిపోతే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. దీంతో ఈ నిబంధనలపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేసిన సంగతీ తెలిసిందే!
అయితే... హిట్ అండ్ రన్ అనేది పూర్తిగా బాధ్యతారాహిత్యమైన ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి! ఈ నేరానికి భారీ శిక్షలు, జరిమానాలు అమలుచేస్తున్నాయి!! ఇందులో భాగంగా... ఏకంగా మరణశిక్ష విధించే అవకాశం ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. చట్టాలు ఎంత బలంగా ఉంటే.. నేరాలు అంత తగ్గుతాయనేది వారి అభిప్రాయం కావొచ్చు. ఈ సందర్భంగా ఏ దేశంలో ఎలాంటి శిక్షలున్నాయనేది చూద్దాం...!
# యునైటెడ్ స్టేస్ ఆఫ్ అమెరికాలో "హిట్ అండ్ రన్" కి పాల్పడితే విధించే శిక్ష ప్రతీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. వాస్తవంగా అమెరికాలో ఈ నేరాన్ని "థర్డ్ డిగ్రీ నేరం"గా పరిగణిస్తారు. ఈ క్రమంలో... ఈ నేరానికి పాల్పడినవారికి శిక్షాకాలం ఒకటి నుంచి ఐదేళ్లు.. కొన్ని సందర్భాల్లో అంతకుమించి ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
# యునైటెడ్ కింగ్ డం (బ్రిటన్) విషయానికొస్తే... అక్కడ ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ముందుగా సంబంధిత డ్రైవర్ తన పూర్తి పేరు, చిరునామాను పోలీసులకు తెలియజేయాలి. అటువంటి సందర్భాల్లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కి మాగ్జిమం 6 నెలల జైలు శిక్ష, ఐదు వేల పౌండ్ల జరిమానా ఉంటుంది.
# ఆస్ట్రేలియాలో హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ ప్రమాద స్థలంలోనే తన వాహనాన్ని ఆపి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఈ సమయంలో ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ నేరాల కోసం ఉన్న ప్రత్యేక కమిషన్.. ప్రతి రోడ్డు ప్రమాదంలో పరిస్థితులను గమనించి డ్రైవర్ కు ఒక పాయింట్ ను ఇస్తుంది. దీని ప్రకారం డ్రైవర్ కు జరిమానా విధించవచ్చు.. లేదా, అతడి లైసెన్స్ ను రద్దు చేసే అవకాశం ఉంది.
# కెనడాలో చట్టాల ప్రకారం... "హిట్ అండ్ రన్"ను తీవ్రమైన నేరంగానే పరిగణిస్తారు. ఇటువంటి కేసులో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కు ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక ఆ ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే మాతరం... అందుకు కారకులైనవారిపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
# న్యూజిలాండ్ లో కూడా రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తప్పనిసరిగా ప్రమాదం జరిగిన చోటే తన వాహనాన్ని ఆపాలి. ఈ విషయంలో విచారణ అనంతరం చర్యలు ఉంటాయి. ఒకవేళ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి వాహనం ఆపకుండా డ్రైవర్ పారిపోతె... అతనికి మూడు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇదే సమయంలో... అతడి డ్రైవింగ్ లైసెన్స్ కనీసం ఆరు నెలల పాటు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది. ఇక ఆ రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే.. అందుకు కారకులైనవారికి సుమారు ఐదేళ్ల జైలు శిక్ష లేదా 20 వేల న్యూజిలాండ్ డాలర్లు జరిమానాగా విధించే అవకాశం ఉంది. ఇదే క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ ను ఒక ఏడాది రద్దు చేసేందుకు అవకాశం ఉంది.
# దక్షిణ కొరియాలో ఈ "హిట్ అండ్ రన్" వ్యవహారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇందులో భాగంగా... ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోయి, డ్రైవర్ పరారైపోతే అతడికి మినిమం ఐదేళ్ల జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీనితో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది.
# ఇక మనపక్కనున్న చైనా విషయానికొస్తే... అక్కడ "హిట్ అండ్ రన్"లో పెను ప్రమాదం జరిగితే తక్షణమే ఆ ప్రమాదానికి కారకుడైన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. కొన్ని సందర్హాల్లో ఇది జీవితకాల నిషేధం కూడా అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో... తీవ్రమైన శారీరక హాని లేదా మరణం సంభవించినట్లయితే నేరస్తునికి 3 - 7 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
# ఇదే సమయంలో మరో సరిహద్దు దేశం బంగ్లాదేశ్ విషయానికొస్తే... హిట్ అండ్ రన్ లేదా ఏ వాహన సంబంధిత ప్రమాదంలో అయినా ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైనవారు నేరస్తులవుతారు. ఈ "హిట్ అండ్ రన్" కేసులో గరిష్టంగా మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంది. ప్రమాద తీవ్రతను బట్టి ఇటువంటి సందర్భాల్లో డ్రైవర్ ను వెంటనే అరెస్టు చేస్తారు. బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు.