రోడ్లు ఎక్కగానే నన్ను తిడతారు.. అసలు సంగతి ఇదీ.. ధర్మాన్ ఓపెన్
కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి.
మిగిలిన రోజుల ఎలా ఉన్నా.. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. కాస్తంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంటి వారికి జాగ్రత్తల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి.స్థానిక సమస్యల మీద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. నిధుల లేమి మాటతో పార్టీకి.. ప్రభుత్వానికి డ్యామేజ్ చేయటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. కనీసం రోడ్లు మాత్రమైనా వేయాల్సిన వేళ.. అలాంటివి కూడా పూర్తి చేయని వేళ.. ప్రజలు వచ్చి ప్రశ్నిస్తే.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ధర్మాన చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టకుండా ఉండలేం. సంక్షేమ పథకాల పేరుతో చెప్పే మాటలు బాగున్నా.. మితిమీరిన పథకాలతో వచ్చే ఇబ్బందుల్ని ఆయన మాటలు కళ్లకు కట్టినట్లుగా చేస్తాయని చెప్పాలి.
తాజాగా శ్రీకాకుళం జిల్లా రాగోలు గ్రామంలో నిర్మించిన రెండు కొత్త సచివాలయ భవనాల్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శ్రీకాకుళం - అమదాలవలస రహదారి పనులు ఇప్పట్లో పూర్తి చేయలేమని తేల్చేశారు. ‘మీకు ఇవ్వటానికే డబ్బులు సరిపోతున్నాయి. రోడ్ల పనులు ఇప్పట్లో పూర్తి చేయలేం. అంతవరకుకష్టాన్ని భరించాలి’ అని వ్యాఖ్యానించారు.
మీరు రోడ్లు ఎక్కగానే నన్ను తిడతారన్న ఆయన.. ‘‘శ్రీకాకుళం - అమదాలవసల రహదారి నిర్మాణానికి రూ.40కోట్లు మంజూరు చేశాం. కాంట్రాక్టర్ కొంత పని చేసి పే మెంట్ అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు ఇవ్వటానికే డబ్బు సరిపోవటం లేదు. మీరు ఓటు వేసినా.. వేయకున్నా.. ఆ నిర్మాణం పూర్తి అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఉన్న కష్టాల గురించి ప్రస్తావించే కన్నా.. వాటిని తీరే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది కదా? అలా ఎందుకు చేయట్లేదన్నది ప్రశ్న. రోడ్డు నిర్మాణాన్ని ఎన్నికలకు ముందో.. తర్వాతో పూర్తి చేస్తామన్న ధర్మాన.. ఈ లోపు చిన్న చిన్న రిపేర్లు చేయిద్దామన్న వైనంపై చర్చనీయాంశంగా మారింది.