ఇండిపెండెంట్‌ గా పోటీ చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-01-24 16:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సిట్టింగు ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో ఆయన మార్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో మొత్తం 68 అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కొందరు సిట్టింగులకు సీట్లు నిరాకరించారు. మరికొందరిని ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చోట నుంచి మరొక చోటకి మార్చారు.

ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ కు సీటు లభించలేదు. తొగురు ఆర్థర్‌ ఎస్సైగా తన జీవితాన్ని ప్రారంభించారు. డీఎస్పీ స్థాయి వరకు ఎదిగారు. ఆ తర్వాత అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ గా పనిచేశారు. వైఎస్సార్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో 2014లో సీపీలో చేరి సీటు ఆశించినా ఆయనకు దక్కలేదు. ఇక 2019లో సీటు దక్కించుకుని 40 వేలకు పైగా మెజారిటీతో నందికొట్కూరు నుంచి గెలుపొందారు.

అయితే వచ్చే ఎన్నికల్లో తొగురు ఆర్థర్‌ కు వైసీపీ అధినేత జగన్‌ సీటు నిరాకరించారు. నందికొట్కూరుకు తొగురు ఆర్థర్‌ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గ ఇంచార్జిగా శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి ఉన్నారు. బైరెడ్డి.. తొగురుకు సీటు ఇవ్వవద్దని కోరడం వల్లే జగన్‌ సీటు ఇవ్వలేదని టాక్‌ నడుస్తోంది.

ఈసారి నందికొట్కూరు నుంచి కడప జిల్లాకు చెందిన దారా సుధీర్‌ కు జగన్‌ సీటు కేటాయించారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి సీటు ఇవ్వాలని బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి కోరారు. అయితే వైసీపీ పెద్దలకు సన్నిహిత కంపెనీ అయిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ యాజమాన్యం సూచించడంతో ఆ కంపెనీకి జగన్‌ సీటు ఇచ్చారని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా నియోజకవర్గంలో కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశమైన తొగురు ఆర్థర్‌ తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్‌ గా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. తన అనుచరులు, కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థిగా నందికొట్కూరు నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ తరఫున దారా సుధీర్, టీడీపీ–జనసేన కూటమి తరఫు అభ్యర్థి, మరోవైపు ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ బరిలోకి దిగితే విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News