ఏపీ బీయారెస్ చీఫ్ తోట ఎక్కడ....గులాబీ పార్టీకి హెల్ప్ ఎంత...?
ఏపీ బీయారెస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ఎక్కడ ఉన్నారు అన్నది ఏపీ తెలంగాణా రెండు చోట్లా బీయారెస్ లో చర్చ సాగుతోంది
ఏపీ బీయారెస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ఎక్కడ ఉన్నారు అన్నది ఏపీ తెలంగాణా రెండు చోట్లా బీయారెస్ లో చర్చ సాగుతోంది. ఆయన ఏపీ బీయారెస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికల్లో తన వంతు పాత్ర ఎంతమేరకు నిర్వహించారు అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
నిజానికి చూస్తే తోట చంద్రశేఖర్ ని పార్టీలోకి తీసుకుని పెద్ద పదవి కట్టబెట్టింది ఉభయ ప్రయోజనకరంగా ఉండేందుకే అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ముందుగా జరిగే తెలంగాణా ఎన్నికల్లో తోట తన సామాజికవర్గానికి చెందిన వారిని బీయారెస్ వైపు టర్న్ చేస్తారు అని ఆశించారు. కానీ అలాంటిది ఏమీ ఈసారి ఎన్నికల్లో కనిపించడంలేదు అని అంటున్నారు.
కేవలం ఒక కార్తీక సమారాధన కుత్బుల్లాపూర్ లో జరిగిన కాపు సామాజికవర్గం సమారాధనలో మాత్రం ఆయన పాల్గొన్నారు అని అంటున్నారు. ఈ మీటింగులో మాత్రం కేసీయార్ ప్రభుత్వం మున్నూరు కాపులకు చేసిన మేలుని తోట చంద్రశేఖర్ వివరించారు. గతసారి నాలుగు మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన బీయారెస్ ఈసారి ఏకంగా పది సీట్లను ఇచ్చిందని గుర్తు చేశారు.
అలాగే కాపు భవన్ కి కూడా బీయారెస్ ప్రభుత్వం భూమిని కేటాయించడమే కాకుండా పది కోట్ల రూపాయలను మంజూరు చేసి కాపుల సంక్షేమానికి కేసీయార్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని గుర్తు చేశారు. మున్నూరు కాపుల సంక్షేమానికి కేసీయార్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందుకే బీయారెస్ కి అండగా నిలవాలని ఆయన కోరారు.
అయితే తోట చంద్రశేఖర్ నుంచి ఇంతకంటే ఎక్కువగానే బీయారెస్ ఆశించింది అని అంటున్నారు.కనీసం ఏపీ నుంచి వచ్చిన సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ ఖమ్మం, నల్గొండ,మహబూబ్ నగర్ వంటి చోట్ల తన వంతుగా తోట చంద్రశేఖర్ ప్రచారం చేసి ఉంటే బాగుండేది అన్న భావన కూడా వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు.
ఏది ఏమైనా కేసీయార్ పూర్తి స్థాయిలో తోట మీద పెట్టుకున్న నమ్మకం అయితే నెరవేరలేదు అని అంటున్న వారే ఉన్నారని అంటున్నారు. మరో వైపు బీజేపీ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు ఇచ్చి మరీ ప్రచారం చేయిస్తోంది. బలమైన కాపు ఓట్లతో పాటు ఏపీ సెటిలర్ల ఓట్లను సాధించేందుకు బీజేపీ ఇలా చేస్తోంది అని అన్న వారూ ఉన్నారు.
బీయారెస్ ని జాతీఎయ పార్టీగా చేస్తూ ఏపీలో బలమైన సామాజికవర్గం నుంచి ముందు చూపుతో నేతను ఎంపిక చేసుకున్నా కూడా తెలంగాణా ఎన్నికల్లో వర్కౌట్ అయింది పెద్దగా లేదు అన్న భావన కూడా వ్యక్తం అవుతోంది. రేపటి ఎన్నికల్లో బీయారెస్ గెలిచిన తరువాత ఏపీ బీయారెస్ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ కూడా ఉంది. ఏమైనా గులాబీ తోటలో కుసుమాలు వికసిస్తాయని పెట్టుకున్న ఆశలు అయితే నెరవేరలేదు అని అంటున్నారు. ప్రతీ ఒక్క ఓటూ కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో తోట చేసింది అయితే తక్కువే అన్న అభిప్రాయం కూడా ఉంది అంటున్నారు.