"రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం"... ముకేష్ అంబానీకి బెదిరింపులు!

ఈ ఘటన జరిగిన వారం రోజులకే ఆ పేలుడు పదార్థాలతో నిండిఉన్న కారు యజమాని మన్‌ సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు.

Update: 2023-10-28 06:14 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఈ-మొయిల్‌ ఐడీకి శుక్రవారం (అక్టోబరు 27) గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. "మా దగ్గర మంచి షూటర్లున్నారు. రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం" అని ఆ మెయిల్‌ లో ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తుంది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా కలకలం రేపింది.

అవును... శుక్రవరాం రాత్రి రాత్రి 8.51 గంటలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానికీ, ఆయన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సెక్యూరిటీ హెడ్‌ కి షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద మెయిల్ వచ్చిందని తెలుస్తుంది. ఆ మెయిల్ లో అంబానీని రూ.20 కోట్లు డిమాండ్ చేశారని అంటున్నారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారట.

దీంతో ముకేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ ఛార్జ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు ఐపీసీ సెక్షన్ 387, 506(2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి పేరుమీద ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు... అతడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

అయితే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇండియాలోనే అత్యంత ధనవంతుడు అయిన ముకేష్ అంబానీకి, ఆయన కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు రావటం ఇదే తొలిసారి కాదు. 2021లో అంబానీ నివాసం "యాంటిలియా"పై బాంబులు వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు నింపిన కారును గుర్తించి స్వాధీనం చేసుకోవటం సంచలనం సృష్టించింది.

ఈ ఘటన జరిగిన వారం రోజులకే ఆ పేలుడు పదార్థాలతో నిండిఉన్న కారు యజమాని మన్‌ సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఆ సమయంలో... ఈ కేసులను తొలుత ఇన్‌ స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలింది. దీంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు ఆయనను అరెస్టు చేశారు.

ఇదే క్రమంలో... గతేడాది ఆగస్టు 15వ తేదీన ఓ వ్యక్తి నుంచి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌ కిసాన్‌ దాస్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ వచ్చింది. ఆసుపత్రిని బాంబులతో పేల్చేస్తామని.. అంబానీ ఫ్యామిలీని చంపేస్తామని నిందితుడు బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

కాగా... ముకేష్ అంబానీకి ప్రాణహాని ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆయన భద్రతను మరింత పటిష్ఠం చేసింది. ఇందులో భాగంగా ఆయనకు జెడ్+ కేటగిరీ భద్రతను, ఆయన సతీమణి నీతా అంబానీకి వై+ కేటగిరీ భద్రతను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో అంబానీ కుటుంబం నివశించే ఇల్లు, కార్యాలయం చుట్టూ సీ.ఆర్.పీ.ఎఫ్. బలగాలు భద్రతను కూడా అందిస్తున్నాయి!

Tags:    

Similar News