ఎన్నికల బరిలో ముగ్గురు అన్నదమ్ములు... ఈసారి గెలిస్తే హ్యాట్రిక్!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రకటించిన జాబితాలో ముగ్గురు అన్నదమ్ములు ఉండటం గమనార్హం.

Update: 2024-03-16 11:00 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే వైసీపీ 175 ఎమ్మెల్యే స్థానాలకు, 24 (అనకాపల్లి పెండింగ్ లో ఉంది) ఎంపీ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకటించిన 199 స్థానాల్లోనూ 50శాతం అంటే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రకటించిన జాబితాలో ముగ్గురు అన్నదమ్ములు ఉండటం గమనార్హం.

అవును... వైసీపీ తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఈ ముగ్గురు అన్నదమ్ములూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవగా... మరోసారి మూడు స్థానాలలో, ముగ్గురికీ టిక్కెట్లు దక్కాయి. ఇక వీరి పేర్లు, వారు పోటీ చేసిన నియోజకవర్గాలు, గతంలో సాధించిన ఓట్లు మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం...!

తాజాగా వైసీపీ ప్రకటించిన 175 మంది ఎమ్మెల్యేల జాబితాలో ముగ్గురు అన్నదమ్ములకు మరోసారి అవకాశం దక్కింది. ఇందులో భాగంగా... మంత్రాలయం నుంచి వై. బాలనాగిరెడ్డి, గుంతకల్ నుంచి వై. వెంకట రామిరెడ్డి, ఆదోని నుంచి వై. సాయి ప్రసాద్ రెడ్డిలు మరోసారి అవే స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. వీరు ముగ్గురూ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డి కుమారులు.

ఇక గత ఎన్నికల్లోనూ మంత్రాలయం నుంచి పోటీచేసిన బాలనాగిరెడ్డి... 2014లో 7,462.. 2019లో 23,879 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే సమయంలో... గుంతకల్ నుంచి పోటీచేసిన వెంకట రామిరెడ్డి.. 2014లో 5,094 ఓట్ల తేడాతో ఓడిపోగా.. 2019లో 48,532 ఓట్ల భారీ మెజారిటీతో విక్టరీ సాధించారు.

ఇక ఆదోని నుంచి పోటీచేస్తున్న సాయి ప్రసాద్ రెడ్డి విషయానికొస్తే... 2014లో 16,831 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయన.. 2019లో 12,319 ఓట్ల మెజారిటీతో మరోసారి గెలిచారు. ఈ ముగ్గురూ 2024 ఎన్నికల్లో తిరిగి గెలిస్తే... ముగ్గురు అన్నదమ్ములు, మూడు నియోజకవర్గాల్లో, ఒకే పార్టీ నుంచి మూడు సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టినట్లు చరిత్రలో నిలిచిపోతుంది!!

Tags:    

Similar News