ముగ్గురికీ పెద్ద సవాలేనా ?

రాబోయే తెలంగాణా ఎన్నికలు మూడుపార్టీల అధ్యక్షులకు పెద్ద సవాలుగా తయారైంది. సబ్జెక్టయితే ఎన్నికలే కానీ కోణాలే వేర్వేరని చెప్పాల్సిందే.

Update: 2023-10-04 04:43 GMT

రాబోయే తెలంగాణా ఎన్నికలు మూడుపార్టీల అధ్యక్షులకు పెద్ద సవాలుగా తయారైంది. సబ్జెక్టయితే ఎన్నికలే కానీ కోణాలే వేర్వేరని చెప్పాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే మొత్తం 119 నియోజకవర్గాలకు కేసీయార్ 115 చోట్ల అభ్యర్ధులను ప్రకటించేశారు. టికెట్లు ప్రకటించి కూడా సుమారు నెలన్నరవుతోంది. ఇక కాంగ్రెస్ విషయం చూస్తే అభ్యర్దుల ప్రకటనకు ఢిల్లీలో పెద్ద కసరత్తే జరుగుతోంది. టికెట్ల కోసం పెరిగిపోతున్న ఒత్తిళ్ళ నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపిక అంత సులభంకాదు. ఇదే సమయంలో బీజేపీ విషయానికి వస్తే అభ్యర్ధుల గుర్తింపే పార్టీకి పెద్ద సమస్యగా మారుతోంది.

ఇక విషయంలోకి వస్తే కేసీయార్ ప్రకటించిన 115 నియోజకవర్గాల్లో కనీసం 35 నియోజకవర్గాల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. అభ్యర్ధులకు నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లకు, ద్వితీయ శ్రేణినేతలకు ఏమాత్రం పడటంలేదు. వీళ్ళమధ్య సయోధ్య కుదర్చాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కవుటవటంలేదు. అలాగే అసంతృప్తితో బీఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్నారు. దాంతో అసంతృప్తులను బుజ్జగించటం, రాజీనామాలను ఆపటం కేసీయార్ కు పెద్ద సమస్యగా మారిపోతోంది.

కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా దాదాపు ఇలాంటి సమస్యే భయపెడుతోంది. అభ్యర్ధుల ప్రకటన ఇంకా జరగకపోయినా అనధికారికంగా ఎక్కడ ఎవరు పోటీచేయబోతున్నది అందరికీ తెలిసిపోతోంది. పార్టీలో మొదటినుండి ఉన్నవాళ్ళకి కాకుండా చివరినిముషంలో చేరిన వారికి టికెట్లు ఖాయమవుతోందనే ప్రచారం ఇబ్బందిగా మారుతోంది. దీనికి అదనంగా బీసీ, మైనారిటి జనాభా దామాషాలో టికెట్లు ఇవ్వాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. డిమాండ్లకు అనుగుణంగా టికెట్లు దక్కకపోతే ఎవరెలా వ్యవహరిస్తారో అనే టెన్షన్ రేవంత్ లో పెరిగిపోతోంది.

ఇక బీజేపీలో మరో సమస్య పెరిగిపోతోంది. కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బలమైన వ్యతిరేక వర్గం తయారైంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలు లేరు. ఇతర పార్టీల నుండి నేతలను తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలని అనుకుంటే అది సాధ్యం కావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే మహాయితే 35 నియోజకవర్గాలకు మించి గట్టి అభ్యర్థులు లేరు. ఉన్న గట్టి అభ్యర్ధుల్లో కూడా గ్రూపు గొడవలు పెరిగిపోతున్నాయి. మరీ సమస్యల్లో నుండి కిషన్ ఎలా బయటపడతారో అర్ధంకావటంలేదు. స్థూలంగా చూస్తే మూడు పార్టీలకు రాబోయే ఎన్నికలు పెద్ద సవాలే అని అర్ధమైపోతోంది.

Tags:    

Similar News