ఆ ముగ్గురిది భిన్నమైన పరిస్థితి.. అటు పార్టీ.. ఇటు అసెంబ్లీ
ఓవైపు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ.. మరోవైపు అసెంబ్లీలో శాసన సభా పక్ష నేతగా వ్యవహరిస్తూ రెండు బాధ్యతలనూ మోయడం చాలా అరుదైన సన్నివేశం.
ఓవైపు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ.. మరోవైపు అసెంబ్లీలో శాసన సభా పక్ష నేతగా వ్యవహరిస్తూ రెండు బాధ్యతలనూ మోయడం చాలా అరుదైన సన్నివేశం. అసెంబ్లీలో అడుగుపెడుతూనే కొందరు పార్టీ బాధ్యతలను వదులుకుంటారు. మరికొందరు రెండింటినీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా చూస్తే.. తెలంగాణలో ప్రస్తుతం ముగ్గురు నేతలు రెండు బాధ్యతల్లోనూ కొనసాగుతున్నారు.
టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికైతే ఆయనే టీపీసీసీ చీఫ్ గానూ వ్యవహరిస్తున్నారు. 2021లో ఈ బాధ్యతల్లోకి వచ్చిన ఆయన రికార్డు వ్యవధిలో పార్టీని గెలిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నాయకుడు 1984, 1999లో టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పటికీ సాధ్యం కాని రికార్డు ఇది. అలాంటిది రెండేళ్లలోనే టీపీసీసీ చీఫ్ గా పార్టీని విజయపథంలోకి తెచ్చారు రేవంత్. మరోవైపు ఇప్పటికైతే టీపీసీసీ చీఫ్ గా మరొకరి పేరు వినిపించడం లేదు. రేవంత్ నే కొనసాగించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కనీసం ఎంపీ ఎన్నికల వరకైనా ఆయనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటారని భావించాలి. టీపీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో సామాజిక సమీకరణాలనూ చూడాల్సి ఉంటుంది కాబట్టి ఎంపికకు కాస్త సమయం పడుతుందని చెప్పొచ్చు.
కేసీఆర్ అధ్యక్షుడిగానేనా..?
బీ(టీ)ఆర్ఎస్ ను స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉంటూ వస్తున్నారు. 2018 ఎన్నికల తర్వాత ఆయన కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. ఆ తర్వాత కేటీఆర్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నా.. అది జరగలేదు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి రావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా జరిగిన ఘటనలో కేసీఆర్ గాయపడ్డారు. ప్రస్తుతానికి ఆయన ఫిబ్రవరి వరకు అసెంబ్లీకి రానట్లే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ ఆ పార్టీ గళం వినిపిస్తున్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి..
2018 ఎన్నికల్లో తెలంగాణ శాసన సభలో ప్రాతినిధ్యం కరువైన సీపీఐ.. ఈసారి మాత్రం చోటు దక్కించుకుంది. కొత్తగూడెం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలిచారు. సహజంగా ఆ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు (ఒక్కరే ఉన్నప్పటికీ) అవుతారు. కాగా, వామపక్ష పార్టీల్లో రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారు. ఈ సంప్రదాయానికి చెక్ పెడుతూ కూనంనేని పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ పదవిని వదులుకుంటారా? లేదంటే టర్మ్ పూర్తయ్యేవరకు ఆగుతారా? అనేది చూడాలి. కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. ఆయన కూడా గెలిచి ఉంటే వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులు ఇద్దరూ అసెంబ్లీలో ఉన్నట్లయ్యేది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా విజయం సాధించి ఉంటే మరో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అసెంబ్లీలో ఉన్నట్లయ్యేది.