ఒకే నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు.. చాన్సు ఎవరికి!

ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాల నుంచి ముగ్గురు నేతలు టీడీపీలోకి రావడానికి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం.

Update: 2024-08-09 12:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన పార్టీల్లో చేరికలకు వైసీపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల్లో చేరికలకు తమకు తెలిసినవారి ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది.

ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాల నుంచి ముగ్గురు నేతలు టీడీపీలోకి రావడానికి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. వీరు ముగ్గురూ గతంలో టీడీపీలో ఉండి వైసీపీలోకి జంప్‌ అయినవారే. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో మళ్లీ ఆ పార్టీలోకి రావాలని చూస్తున్నారని తెలుస్తోంది.

చీరాల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వరకు ఈ ముగ్గురూ టీడీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి రావాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.

ఆమంచికి 2024 ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో ఎన్నికలకు ముందే వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీ తరఫున చీరాలలో పోటీ చేశారు. దాదాపు 41 వేల ఓట్లను సాధించారు.

ఇక 2024 ఎన్నికల్లో కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్‌ వైసీపీ తరఫున చీరాలలో పోటీ చేసి ఓడిపోయారు.

పోతుల సునీత ఎమ్మెల్సీగా, వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇప్పుడు వీరంతా టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది.

ఆమంచి కృష్ణమోహన్‌.. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ద్వారా, కరణం బలరాం.. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ద్వారా టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

చీరాల నుంచి 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ 2014లో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు.

ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున చీరాలలో గెలిచిన కరణం బలరాం.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడిని వైసీపీ తరఫున పోటీ చేయించారు. అయితే ఆయన కుమారుడు కరణం వెంకటేశ్‌ ఓడిపోయారు.

అలాగే పోతుల సునీత 2014లో టీడీపీ తరఫున చీరాలలో బరిలోకి దిగి ఆమంచి కృష్ణమోహన్‌ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ సీటును కట్టబెట్టారు. అయినప్పటికీ ఆమె వైసీపీలో చేరిపోయారు.

ఆమంచి కృష్ణమోహన్‌ కాపు సామాజికవర్గానికి చెందినవారు. అదేవిధంగా కరణం బలరాం కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. ఇక పోతుల సునీత చేనేత వర్గానికి చెందినవారు.

చీరాలలో చేనేతలు ఎక్కువ. అందులోనూ సునీత బీసీ మహిళ కావడం, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండటం, శాసనమండలిలో టీడీపీకి మెజార్టీ లేకపోవడంతో సునీతను టీడీపీలో చేర్చుకోవచ్చనే టాక్‌ నడుస్తోంది. ఆమంచి, కరణం విషయంలో చంద్రబాబు ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని అంటున్నారు.

Tags:    

Similar News