రూ.41 కోట్ల భవంతిలో ముగ్గురు అనుమానాస్పద మృతి!
స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి మసాచుసెట్స్ రాష్ట్రంలోని వారి భవంతిలో ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి మసాచుసెట్స్ రాష్ట్రంలోని వారి భవంతిలో ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిదీ హత్యా, ఆత్మహత్యా అనే విషయాలపై దర్యాప్తు జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అవును... అమెరికాలో నివసిస్తున్న రాకేష్ కమల్ (57), ఆయన భార్య టీనా (54), వారి కుమార్తె అరియానా (18) మృతదేహాలను మసాచుసెట్స్ రాజధాని బోస్టన్ పట్టణానికి నైరుతి దిశగా 32 కిలోమీటర్ల దూరంలో డోవర్ లో ఉన్న వారి ఖరీదైన భవనంలో గురువారం రాత్రి 7:30 గంటలకు గుర్తించినట్లు నార్ఫోక్ డిస్ట్రిక్ట్ అటార్నీ (డీఏ) మైఖేల్ మోరిస్సే తెలిపారు. అనంతరం అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సమయంలో... రాకేశ్ కమల్ మృతదేహం వద్ద పోలీసులకు ఒక తుపాకీ కనిపించిందని అంటున్నారు. దీంతో... రాకేశ్ కమల్ తన భార్య టీనా, కూతురు ఆరియానాను తుపాకీతో కాల్చి చంపి, తర్వాత తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారని తెలుస్తుంది. రెండు రోజులుగా వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఒక బంధువు పోలీసులకు సమాచారం ఇచ్చారని.. దీంతో ఇంటికి వెళ్లి చూడగా ఈ విషయం తెలిసిందని జిల్లా అటార్నీ తెలిపారు.
2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను రాకేశ్ కమల్ దంపతులు ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆ కంపెనీకి టీనా కమల్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. ఆ సంస్థ వెబ్ సైట్ సమాచారం ప్రకారం... రాకేశ్.. బోస్టన్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి పట్టాలు పొందారు.
ఇక టీనా ఢిల్లీ యూనివర్శిటీ.. హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అని తెలుస్తుంది. రాకేశ్ కు విద్యారంగంలో విశేష అనుభవం ఉండగా... టీనాకు రెడ్ క్రాస్ ఛారిటీ బోర్డులో పనిచేసిన అనుభవం ఉంది. ఈ దంపతుల కుమార్తె ఆరియానా.. వెర్మాంట్ లోని ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ మిడిల్ బరీ కాలేజీలో చదువుతోంది.
డోవర్ లో 5 మిలియన్ డాలర్లు (సుమారు 41 కోట్ల రూపాయలు) విలువైన ఈ భవనంలో ఈ కుటుంబం నివసిస్తోంది. సుమారు 19,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 11 పడక గదులు ఉన్న ఈ ఎస్టేట్ ను కమల్ దంపతులు 2019లో 4 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారని తెలుస్తుంది. అయితే... ఇటీవల కాలంలో వచ్చిన ఆర్ధిక ఇబ్బందులతో విల్సన్ డేల్ అసోసియేట్స్ సంస్థకు ఈ భవనాన్ని 3 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.