కళ్ల ఎదుటే ఉరేసుకున్న భార్య.. వీడియో తీసిన భర్త

విన్నంతనే.. మరీ ఇంత కిరాతకంగా వ్యవహరించటమా? కనీస మానవత్వం లేదా? అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది

Update: 2023-12-14 04:56 GMT

కొన్ని ఉదంతాల గురించి తెలిసినంతనే మనసంతా చేదుగా మారుతుంది. మరీ.. ఇంత దారుణంగా వ్యవహరించటమా? అనిపించకమానదు. హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ పరిధిలోని ఒక కిరాతక భర్త మద్యం మత్తులో చేసిన దుర్మార్గం గురించి తెలిస్తే నోట మాట రాదు. ఇలాంటోడ్ని ఏం చేసినా తప్పు లేదన్న భావన కలుగక మానదు. మద్యం తాగొచ్చిన అతడు.. భార్యను చిత్రవధకు గురి చేయటమేకాదు.. నువ్వు చస్తే మొదటి భార్య వద్దకు వెళతానని చెప్పటం.. ఆమె ఉరి వేసుకుంటానంటే పట్టించుకోకుండా ఆమె ఉరి వేసుకుంటున్న వైనాన్ని వీడియో తీసిన షాకింగ్ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

విన్నంతనే.. మరీ ఇంత కిరాతకంగా వ్యవహరించటమా? కనీస మానవత్వం లేదా? అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అలీగూడకు చెందిన 39 ఏళ్ల షేక్ రసూల్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నలుగురు సంతానం. నాలుగేళ్ల క్రితం 22 ఏళ్ల అర్షా బేగంను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కార్పెంటర్ గా పని చేస్తూ రెండు కుటుంబాల్ని పోషిస్తున్నాడు.

కొంతకాలంగా మద్యానికి బానిసైన అతడు.. రెండో భార్యను శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడు. ఇంట్లో డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అర్థరాత్రి వేళ తాగి వచ్చిన భర్తతో అర్షాబేగం గొడవ పడింది. మద్యం తాగే అలవాటును బంద్ చేయకుంటే ఉరి వేసుకుంటానని బెదిరింపులకు దిగింది.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న రసూల్.. నువ్వు చస్తే.. పెద్ద భార్య దగ్గరకు వెళతానంటూ దారుణంగా మాట్లాడాడు. అంతేకాదు.. ఆమె ఉరి వేసుకుంటుంటే.. వారించకుండా ఆమె చావును వీడియో తీశాడు. తాను అప్పటివరకు చావును ప్రత్యక్షంగా చూడలేదని.. ఉరి వేసుకుంటే చూస్తానంటూ పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె ఉరి వీడియోను తీశాడు. ఆమె మరణించిన తర్వాత బావమరిదికి ఫోన్ చేసి.. అతడి సోదరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులుఘటనా స్థలానికి చేరుకున్నారు. రసూల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దారుణవైనం షాకింగ్ గా మారింది.

Tags:    

Similar News