లడ్డూ ఇష్యూ సుప్రీం కోర్టుకు... అటు స్వామి ఇటు వైవీ !

ఇలా ఒకే సమయంలో ఇద్దరూ సుప్రీం కోర్టుకు వెళ్ళడంతో లడ్డూ ఇష్యూ అత్యున్నత న్యాయ స్థానం పరిధిలోకి వెళ్ళింది.

Update: 2024-09-23 17:31 GMT

ఏపీతో పాటు దేశాన్ని అట్టుడికిస్తున్న శ్రీవారి లడ్డుల ఇష్యూ ఇపుడు సుప్రీం కోర్టుకు చేరింది. కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేశారు అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల చేసిన సంచలన ప్రకటన ప్రపంచంలోని హిందువులలో కలవరం రేపింది. ఆ మీదట ఈ బాణాలు అన్నీ సూటిగా వెళ్ళి వైసీపీని తాకాయి.

ఇక జగన్ చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఇక టీటీడీకి నాలుగేళ్ల పాటు చైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి అయితే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలాంటి అపచారాలు జరగకపోయినా చంద్రబాబు పనిగట్టుకుని ఆలయ ప్రతిష్ట దెబ్బ తీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని వైవీ తన పిటిషన్ లో ఆరోపించారు.

అంతే కాదు శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అన్న ఆరోపణల మీద సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ నిపుణులతో కానీ పూర్తి విచారణ జరిపించాలని అలాగే ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ఇక మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయితే బాబు మీద సుప్రీం కోర్టుకు వెళ్ళారు. బాబు చేసిన లడ్డూ వ్యాఖ్యలు అన్నీ ఆధారం లేనివి అని స్వామి అంటున్నారు. అందుకే దీని మీద న్యాయ స్థానం జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని కోరారు.

ఇలా ఒకే సమయంలో ఇద్దరూ సుప్రీం కోర్టుకు వెళ్ళడంతో లడ్డూ ఇష్యూ అత్యున్నత న్యాయ స్థానం పరిధిలోకి వెళ్ళింది. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరో వైపు రోజు రోజుకీ బదనాం అవుతున్న వైసీపీ కోర్టు ద్వారానే న్యాయ విచారణతోనే దీనిని ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉందని భావిస్తోంది. లేకపోతే ఇది అంతకంతకూ పెరిగి మరింతగా డ్యామేజ్ తెస్తుందని అపుడు టోటల్ వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కలవరపడుతోంది.

మొత్తానికి చూస్తే సుప్రీంకోర్టు ఈ విషయంలో కచ్చితమైన చర్యలకు దిగుతుందని అంతా అనుకుంటున్నారు. చాలా విషయాలలో కీలకమైన తీర్పును ఇచ్చిన దేశ ఉన్నత న్యాయ స్థానం తిరుమల ప్రతిష్టను కాపాడే విధంగా వ్యవహరిస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News