అదనంగా రూ. 6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు

దేశంలో టోల్ గేట్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే అదనంగా రూ. 6 వేల కోట్లు సమకూరినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

Update: 2024-12-31 10:05 GMT

దేశంలో టోల్ గేట్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే అదనంగా రూ. 6 వేల కోట్లు సమకూరినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల ద్వారా రూ.62,293.4 కోట్లు వసూలైతే 2024 డిసెంబర్ 31 నాటికి ఈ మొత్తం రూ.68,037.60 కోట్లకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలో దాదాపు రూ. 6 వేల కోట్లు అదనపు ఆదాయం వచ్చింది.

దేశంలో మొత్తం 1040 టోల్ గేట్లు ఉన్నాయి. సుమారు 46,884 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులపై ఈ టోల్ గేట్లను ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా వాహనాల నుంచి ఈ టోల్ గేట్లలో ట్యాక్స్ వసూలు చేస్తుంటారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అదనంగా 4,289 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించి 94 టోల్ గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో టోల్ ఆదాయం కూడా బాగా పెరిగింది. గత ఏడాది రోజుకు సగటున రూ.170.66 కోట్లు వసూలైతే, ఈ ఏడాది ఆ మొత్తం సగటున రూ.191.14 కోట్లకు చేరింది.

ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలులోకి తెచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతోంది. అదేసమయంలో పన్ను ఎగవేతలు కూడా తగ్గిపోయాయి. రహదారులపై వాహనాలు గంటలకొద్దీ వేచిచూడాల్సిన అవసరం లేకపోయింది. రవాణా మెరుగు అవ్వడంతో పర్యాటక రంగం, దాని అనుబంధ రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. ఫలితంగా టోల్ ట్యాక్స్ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు.

టోల్ గేట్ల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం పెరిగినా, ఆ మేరకు సౌకర్యాలు పెరగడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జాతీయ రహదారుల్లో కనీస సౌకర్యాలు ఉండటం లేదని, అదేవిధంగా రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News