రైల్వే అడ్వాన్స్ బుకింగ్ ఇకపై 120 రోజులు కాదు.. 60 రోజులే

అడ్వాన్స్ బుకింగ్ ను ఇప్పటివరకు 120 రోజులుగా ఉనన విషయం తెలిసిందే.

Update: 2024-10-18 04:22 GMT

తరచూ రైళ్లలో ప్రయాణించే వారంతా తెలుసుకోవాల్సిన కీలక అప్డేట్ ఒకటి వచ్చేసింది. ఇప్పటివరకు అమలైన ట్రైన్ రిజర్వేషన్ కు సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్ ను ఇప్పటివరకు 120 రోజులుగా ఉనన విషయం తెలిసిందే. అది కాస్తా ఇప్పుడు 60 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సగం రోజుల్ని తగ్గించటానికి.. గడువు కుదించటానికి కారణం ఏమిటన్న దానిపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. 120 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో టికెట్ క్యాన్సిలేషన్లు ఎక్కువగా ఉన్న విషయాన్ని తాము గుర్తించినట్లుగా పేర్కొంది.

ప్రస్తుతం టికెట్ల క్యాన్సిలేషన్ రద్దు శాతం 21 శాతంగా ఉందని.. నాలుగైదు శాతం మంది అసలు ప్రయాణమే చేయటం లేదన్న విషయాన్ని గుర్తించారు. ఇలాంటి వారు టికెట్లను రద్దు చేసుకోవటం కూడా మర్చిపోతున్నారని.. వీరి కారణంగా సీట్లు.. బెర్తులు వేస్ట్ అయిపోతున్నట్లుగా గుర్తించారు. అంతేకాదు.. పలు రకాల మోసాలు.. రైల్వే అధికారులు అక్రమంగా డబ్బులు తీసుకోవటం లాంటి ఘటనలకు ఇంత గ్యాప్ ఉండటం కారణంగా మారిందంటున్నారు. అందుకే.. అడ్వాన్స్ బుకింగ్ రోజుల్ని కుదించటం ద్వారా మోసాలకు చెక్ పెట్టే వీలుందన్న వాదనను రైల్వే శాఖ వినిపిస్తోంది.

ఎక్కువ గడువు ఉన్న కారణంగా కొంతమంది ముందస్తుగా సీట్లను బ్లాక్ చేసుకునే వీలు ఉందన్న రైల్వే శాఖ.. గడువు తక్కువగా ఉంటే నిజమైన ప్రయాణికులకు సాయంగా ఉంటుందని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. తక్కువ క్యాన్సిలేషన్లు.. ప్రయాణికుల డిమాండ్ అధికంగా కనిపిస్తే అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖఖు వీలు ఉంటుందని పేర్కొంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ముందస్తు ట్రైన్ రిజర్వేషన్ నమోదు గడువు కుదించటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కుదించటం..కొద్ది కాలం తర్వాత మళ్లీ పెంచటం లాంటివి చేశారు. తాజాగా మరోసారి అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల గడువును సగానికి సగం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే. ఈ కొత్త పాలసీ ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై రైల్వే శాఖ క్లారిటీ ఇవ్వలేదు.

Tags:    

Similar News