ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనం... ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. తాను చూపించబోయే సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ లోనే చూపించే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. తాను చూపించబోయే సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ లోనే చూపించే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా సుంకాలు, అక్రమ వలసల విషయంలో సీరియస్ చర్యలు తప్పవనే చర్చా నడుస్తుంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశాల విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ప్రపంచంలోని పలు దేశాలకు తనదైన సూచనలు, మరికొన్నింటికి తన మార్కు హెచ్చరికలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్... తాజాగా పొరుగు దేశాలు పొందుతున్న రాయితీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కెనడా, మెక్సికో దేశాలకు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండూ అమెరికా రాష్ట్రాలైతే సరిపోతుందని వ్యాఖ్యానించారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పొరుగుదేశాలకు సంబంధించిన పలు అంశాలపై స్పందించారు ట్రంప్. ఇందులో భాగంగా... కెనడాకు ఏటా 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8 లక్షల కోట్లు) పైగా రాయితీలు కల్పిస్తున్నామని.. మెక్సికోకు 300 బిలియన్ డాలర్లు (సుమారు రూ.24 లక్షల కోట్లు)కు పైగా సబ్సిడీ ఇస్తున్నామని అన్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఈ రెండు దేశాలకూ ఇంత భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే, ఆ రెండూ దేశాలు అమెరికాలో విలీనం అయిపోతే మంచిదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఈ తరహా కామెంట్లు కెనడా ప్రధానికి ఇప్పటికే ఇచ్చారని అంటున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఫ్లోరిడాకు వచ్చి ట్రంప్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో టారిఫ్ లు, సబ్సిడీల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సూచనలతో కూడిన హెచ్చరికలు ట్రంప్ నుంచి ట్రూడోకు వెళ్లాయని అంటున్నారు.
ఇందులో భాగంగా... అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల రవాణా కట్టడి చేయడంలో విఫలమైతే అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని ట్రంప్ చురకలు అంటించినట్లూ చెబుతున్నారు. కాగా.. అక్రమ వలసదారులను కట్టడి చేయకపోతే కెనడా, మెక్సికో దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.