ట్రంప్ - కమలా మధ్య జరిగే డిబేట్ లో రూల్స్ కూడా ఉంటాయా?
వాళ్లు సాదాసీదా వాళ్లు కాదు. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు కాబోయే అభ్యర్థుల్లో ఒకరు. పవర్ ఉన్నా లేకున్నా వారు పవర్ ఫుల్లే.
వాళ్లు సాదాసీదా వాళ్లు కాదు. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు కాబోయే అభ్యర్థుల్లో ఒకరు. పవర్ ఉన్నా లేకున్నా వారు పవర్ ఫుల్లే. అలాంటి అత్యంత శక్తివంతమైన నేతల మధ్య జరిగే బిగ్ డిబేట్ ఎలా ఉంటుందన్నది యావత్ ప్రపంచానికి ఆసక్తి ఉంటుంది. వారు మాట్లాడే అంశాలు.. వారి ప్రాధాన్యతలు ప్రపంచాన్నే ప్రభావితం చేస్తాయి మరి. ఎవరు అవునన్నా.. కాదన్నా కూడా ఇది నిజం. అలాంటి ఇద్దరు నేతల మధ్య జరిగే డిబేట్ కు ఎలాంటి నిబంధనలు ఉంటాయా? అసలు రూల్స్ వారికి వర్తిస్తాయా? లాంటి సందేహాలు రావొచ్చు.
దీనిపై కొంత లోతైన అధ్యయనం తర్వాత బయటకు వచ్చిన అంశాలు ఆద్యంతం ఆసక్తికరమని చెప్పాలి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9 గంటల వేళలో ఈ బిగ్ డిబేట్ జరగనుంది. ఫిలడెల్పియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో ఈ డిబేట్ జరగనుంది. ఏబీసీ చానల్ లో జరిగే ఈ ప్రోగ్రాంను లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. మొదటి డిబేట్ లో డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్న బైడెన్ పై రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ పైచేయి సాధించారు. పోల్ సర్వేలోనూ ట్రంప్ పట్ల సానుకూలత వ్యక్తమైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హారిస్ రంగంలోకి దిగటంతో పోటీ నువ్వానేనా అన్నట్లు మారింది. ఇప్పటివరకు వెల్లడైన సర్వేల ప్రకారం కమలా హారిస్ ముందంజలో ఉన్నారు. అయితే.. ఎన్నికల్లో గెలుపు మీద ట్రంప్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగే డిబేట్ లో తొలిసారి ట్రంప్ - కమలా హారిస్ ముఖాముఖిన తలపడుతున్నారు. ఇరువురు అభ్యర్థులు డిబేట్ కు సీరియస్ గా సిద్ధమవుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగే డిబేట్లు కూడా అభ్యర్థుల గెలుపు ఓటముల్ని డిసైడ్ చేస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే.. ఈ డిబేట్లకు అంత ప్రాధాన్యత.
మరి.. ఇద్దరు పవర్ ఫుల్ నేతలు పాల్గొంటున్న డిబేట్ కు రూల్స్ ఏమైనా ఉన్నాయా? అన్న విషయంలోకి వెళితే.. మొదటి డిబేట్ లో జరిగిన రచ్చ నేపథ్యంలో.. ఈసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవేమంటే..
- డిబేట్ జరిగే గదిలో ప్రేక్షకులు ఎవరూ ఉండరు.
- చర్చను ఏబీసీ చానల్ యాంకర్లు డేవిడ్ ముయిర్.. లిన్సే డేవిస్ లు చేపడతారు.
- 90 నిమిషాలు పాటు జరిగే డిబేట్ కు మధ్యలో రెండుసార్లు బ్రేకులు ఇస్తారు.
- ఒకరు మాట్లాడే వేళలో మరొకరు రన్నింగ్ కామెంట్రీ చేయకూడదు. (మొదటి డిబేట్ లో ఇదే జరిగింది)
- మొదటి డిబేట్ వివాదాస్పదమైన నేపథ్యంలో ఈసారి ఒకరు మాట్లాడే వేళ.. మరొకరి మైక్ ను మ్యూట్ చేస్తారు.
- డిబేట్ ను జరిపే యాంకర్లు మాత్రమే ప్రశ్నలను అడుగుతారు.
- ఏయే అంశాల మీద ప్రశ్నలు అడుగుతారన్న దానిపై అభ్యర్థులకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వరు.
- చర్చ మొత్తం లైవ్ లోనే నిర్వహిస్తారు.
- ప్రతి అభ్యర్థి మాట్లాడేందుకు 2 నిమిషాలు టైం ఇస్తారు. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడాలి.
- రూల్ ప్రకారం ఎవరైనా వివరణ ఇవ్వాలంటే.. మరో నిమిషాన్ని కేటాయిస్తారు.
- చర్చ చివర్లో మాత్రం ముగింపు మాటల కోసం ఇద్దరికి రెండేసి నిమిషాల చొప్పున టైం ఇస్తారు.
- చర్చ సందర్భంగా ఇద్దరు అభ్యర్థులు నిలుచొనే మాట్లాడాల్సి ఉంటుంది.
- ముందస్తుగా రాసుకొచ్చిన నోట్స్.. డాక్యుమెంట్స్ ను చర్చకు అందుబాటులో ఉంచరు.
- డిబేట్ జరిగే టైంలో మాత్రం నోట్స్ రాసుకోవటానికి ఒక పెన్ను.. పేపర్ ప్యాడ్.. ఒక వాటర్ బాటిల్ ఇస్తారు.
- చర్చ మధ్యలో 2సార్లు బ్రేక్ ఇచ్చినప్పటికీ తమ ప్రచార బ్రందంతో మాట్లాడేందుకు అనుమతి ఉండదు.