పాప్ సూపర్ స్టార్ కు ట్రంప్ సీరియస్ వార్నింగ్.. కరెక్టేనా?

రాజకీయాల్లో ఏది మంది? ఏది చెడు? అన్నది పెద్దగా ఉండదు. అవసరానికి తగ్గట్లు మంచిచెడుల్లో మార్పులు వచ్చేస్తుంటాయి.

Update: 2024-09-12 04:24 GMT

రాజకీయాల్లో ఏది మంది? ఏది చెడు? అన్నది పెద్దగా ఉండదు. అవసరానికి తగ్గట్లు మంచిచెడుల్లో మార్పులు వచ్చేస్తుంటాయి. అదే సమయంలో కొంతమందికి మంచి అనిపించే అంశం.. మరికొందరికి మాత్రం చెడుగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రతిష్ఠాత్మకంగా.. పోటాపోటీగా సాగే ఎన్నికల వేళ.. ఒకరికి తమ మద్దతును ప్రకటించే సెలబ్రిటీలకు సీరియస్ వార్నింగ్ ఇవ్వటం సమంజసమేనా? అన్నది ప్రశ్న. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి.. మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా పాప్ సూపర్ స్టార్ టేలర్ స్విఫ్ట్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు తన మద్దతు పలికిన ఆమె ప్రకటనపై స్పందించిన ట్రంప్.. ‘‘నేను టేలర్ స్విఫ్ట్ అభిమానిని కాదు. కేవలం సందర్భం వచ్చిందని మాత్రమే చెబుతున్నా. మీరు నిజంగానే బైడెన్ కు మద్దతు పలకలేరు. కానీ.. ఆమె ఎల్లప్పుడు డెమోక్రాట్లను సమర్థిస్తున్నట్లుగా అనిపిస్తోంది. అందుకు ఆమె భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.

కమలా హారిస్ కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా టేలర్ షిఫ్ట్ సోషల్ మీడియాలో చేసిన ప్రకటనే ట్రంప్ అక్కసుకు కారణంగా చెబుతున్నారు. తాజాగా ఆమె రానున్న అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్.. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న టిమ్ వాజ్ కు తాను ఓటు వేస్తానని ప్రకటించారు. ‘‘మన హక్కులు మనకు కావాలంటే ఒక వారియర్ అవసరమని భావిస్తున్నా. వారు హక్కుల కోసం పోరాడతారు. గందరగోళంతో కాకుండా ప్రశాంతంగా దేశం కోసం ఏదైనా సాధించవచ్చని నమ్ముతున్నా’’ అని ఆమె పేర్కొన్నారు.

తానెంతో ఆలోచించి తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పిన ఆమె ప్రకటన ట్రంప్ నకు చిరాకు పుట్టించింది. అసలే ట్రంప్.. అందునా తనకు వ్యతిరేకంగా.. తన ప్రత్యర్థికి అనుకూలంగా ఇంత భారీ ప్రకటన చేసిన తర్వాత ఆయనకు ఒళ్లు మండక మానుతుందా? అందుకే.. మోహమాటం అన్నది లేకుండా.. సదరు పాప్ సూపర్ స్టార్ కు వార్నింగ్ ఇచ్చేశారు. అయితే.. ఆమె ఎందుకు ఈ తరహా ప్రకటన చేసిందన్న దానికి కారణం లేకపోలేదు.

టేలర్ షిఫ్ట్ తన మద్దతును కమలాకు ప్రకటించటానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవే.. ఆమె చేత ప్రకటన చేసేలా చేసింది. టేలర్ అభిమానులు స్విఫ్టీస్ ఫర్ కమల పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. అయినా ఆమె స్పందించలేదు. కానీ.. మరికొందరు మాత్రం ఆమె ట్రంప్ నకు మద్దతు పలుకుతున్నట్లుగా ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీంతో.. ఆమెకు చిరాకు కలిగినట్లుగా భావిస్తున్నారు. ఎప్పుడైతే ట్రంప్ - కమలా మధ్య తొలి డిబేట్ పూర్తైన తర్వాత.. టేలర్ షిఫ్ట్ తన మద్దతును ప్రకటిస్తూ.. సోషల్ మీడియాలో ప్రకటన చేయటం ద్వారా.. తన మద్దతు ఎవరిదన్న విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష ఎన్నికల్లో తాను ఎవరికి ఓటు వేస్తానని స్పష్టంగా చెప్పేయటమే కాదు.. ‘‘గొడవలు.. గందరగోళం లేకుండా ప్రశాంతంగా పాలన అందిస్తే.. దేశంలో మనం చాలా ఎక్కువగా సాధించగలమని నమ్ముతున్నా’’ అని పేర్కొనటం ట్రంప్ కు నచ్చలేదని భావిస్తున్నారు.

టేలర్ తన మద్దతు గురించి ప్రకటన చేసి ఉంటే పెద్దగా రియాక్టు అయ్యే వారు కాదని.. ఎప్పుడైతే తాను గెలిస్తే అమెరికాకు జరిగే నష్టమంటూ చేసిన వ్యాఖ్యలే ఆయన ఆగ్రహానికి కారణంగా భావిస్తున్నారు. ఏమైనా.. ఒక సెలబ్రిటీ తన రాజకీయ మద్దతు గురించి ప్రకటన చేసినంత మాత్రాన.. వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే తీరు మంచిది కాదని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News