అస్త్రాలు రెడీ చేసుకున్నారా ?

ఎలాగూ కేసీయార్ కూడా హాజరవబోతున్నారు కాబట్టి ఇరుకునపెట్టేందుకు ప్రభుత్వపరంగా కాంగ్రెస్ అస్త్రాలను రెడీ చేసుకున్నది.

Update: 2024-02-08 04:27 GMT

తెలంగాణా అసెంబ్లీ ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం మొదలవుతున్నాయి. సుమారు నాలుగురోజులు జరగవచ్చని అనుకుంటున్నారు. తాత్కాలిక బడ్జెట్ పాస్ చేయించుకోవటమే ముఖ్యం కాబట్టి అది అయిపోగానే సమావేశాలను వాయిదా వేసేస్తారు. అయితే సమావేశాలు జరిగే నాలుగు రోజుల్లోనే ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవటానికి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ రెడీ అయిపోయాయి. ఇదే పని ఇంతకుముందు కూడా జరిగినా ఇపుడు మాత్రం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి.

ప్రత్యేకం ఏమిటంటే ఈ సమావేశాల్లో కేసీయార్ కూడా పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీయార్ ఎంపికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిసిన రెండోరోజే కేసీయార్ బాత్ రూములో పడిన విషయం తెలిసిందే. అప్పుడు తుంటి ఎముక విరగటంతో ఆపరేషన్ జరిగింది. డాక్టర్ల సలహాప్రకారం రెండునెలలు పూర్తి విశ్రాంతి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితమే ఎంఎల్ఏగా ప్రమాణం చేశారు. తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఈరోజు నుండి మొదలవుతున్న సమావేశాలకు కేసీయార్ కూడా హాజరవుతారు.

ఎలాగూ కేసీయార్ కూడా హాజరవబోతున్నారు కాబట్టి ఇరుకునపెట్టేందుకు ప్రభుత్వపరంగా కాంగ్రెస్ అస్త్రాలను రెడీ చేసుకున్నది. వీటిల్లో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణం, ధరణి పోర్టల్లో బయటపడుతున్న అక్రమాలు, మిషన్ భగీరథలో వేల కోట్లరూపాయల అవినీతి ఆరోపణలు, వివిధ సంస్ధల వేలకోట్ల రూపాయల అప్పులు, వ్యవసాయానికి 24 గంటలు నిరంతర విద్యుత్ అనే అబద్ధపు ప్రచారాల్లాంటి అనేక అంశాలను అస్త్రాలుగా రేవంత్ రెడ్డి అండ్ కో రెడీ చేసుకున్నది.

కాంగ్రెస్ అస్త్రాలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కూడా రెడీ అయ్యింది. పదేళ్ళ కేసీయార్ పాలనలో రాష్ట్రం ఏ స్ధాయిలో డెవలప్ అయ్యింది, ఎలాంటి తెలంగాణాను ఏ స్ధాయికి తీసుకెళ్ళింది, వ్యవసాయ, విద్యుత్, ఐటి రంగాలతో పాటు పెట్టుబడులు సాధించిన విషయాలను ప్రస్తావించాలని కేసీయార్ రెడీ అయ్యారు. కేఆర్ఎంబీకి తెలంగాణా ప్రాజెక్టులను అప్పగించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయంగా నిరూపించేందుకు బీఆర్ఎస్ రెడీ అయ్యింది. వంద రోజుల్లో సిక్స్ గ్యారెంటీస్ అమలు లాంటి ఆరోపణలతో బీఆర్ఎస్ సభలో ఎదురుదాడికి సిద్ధమైంది. అందుకనే రెండువైపుల నుండి అస్త్రాలు రెడీ అయ్యాయని అనుకుంటున్నది.


Tags:    

Similar News