జోరందుకుంటున్న 'రైతుబంధు' రాజకీయం

పథకం అమలుకు కారణం మీరేనంటే కాదు కాదు మీరే అని బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు.

Update: 2023-11-28 05:06 GMT

రైతుబంధు పథకం చుట్టూ రాజకీయం మొదలైంది. పథకం అమలుకు కారణం మీరేనంటే కాదు కాదు మీరే అని బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. నిజానికి రైతుబంధు పథక అమలుని కేసీయార్ పెద్ద డ్రామాగా మార్చేవారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవట. 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి వ్యవసాయం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకం అమలుకు ఇప్పటికిప్పుడు సుమారు రు. 7500 కోట్లు కావాలట.

ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వం దగ్గర లేదు. అందుకనే కేసీయార్ ఒక ప్లాన్ వేశారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదేమిటంటే కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి కోరాలని. ఎందుకంటే పథకం అమలుకు కమీషన్ సమాధానం ఇచ్చేందుకు టైం తీసుకుంటుంది లేకపోతే వద్దంటుందన్నది కేసీయార్ ఆలోచన. దాంతో పథకం అమలును కమీషన్ అడ్డుకుందని, కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని చెప్పుకోవాలన్నది కేసీయార్ ఆలోచన. అయితే కొద్దిరోజులు ఏమీ మాట్లాడని కమీషన్ సడెన్ గా పథకం అమలును 28వ తేదీలోగా ఎలాంటి ప్రచారం చేసుకోకుండా అమలు చేయమని చెప్పింది.

దాంతో కేసీయార్ కు షాక్ కొట్టినట్లయ్యింది. వెంటనే మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారట. దాంతో హరీష్ మాట్లాడుతు 28వ తేదీన రైతుబంధు పథకం డబ్బులు అందరి రైతుల ఖతాల్లో పడుతుందని ప్రకటించారు. దాంతో తన ఆదేశాలను మంత్రి ఉల్లంఘించారని చెప్పి ఎన్నికల కమీషన్ వెంటనే పథకం అమలు అనుమతిని ఉపసంహరించుకున్నది. దాంతో రైతుబంధు చుట్టు రాజకీయం మొదలైపోయింది. పథకం ఆగిపోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని కేసీయార్, కేటీయార్, హరీష్ మండిపడుతున్నారు.

ఇదే సమయంలో కమీషన్ తీసుకున్న నిర్ణయానికి తమకు ఎలాంటి సంబంధంలేదని కాంగ్రెస్ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇంతలో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కేశవరావు మాట్లాడుతు పథకం అమలుకు కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధంలేదని ప్రకటించారు. దాంతో రైతుబంధు పథకం చుట్టూ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఈ మొత్తంలో కేసీయార్ వ్యూహం సక్సెస్ అయినట్లా ? లేకపోతే అట్టర్ ఫైల్ అయ్యిందా అన్నదే అర్ధంకావటంలేదు. ఈ విషయంలో క్లారిటి రావాలంటే 3వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News