బీసీ వర్సెస్ ఓసీ: కీలక పదవిపై వైసీపీ అంతర్మథనం
ఈ క్రమంలో బీసీ నేతకు ఇవ్వాలా? లేక ఓసీలకు ఇవ్వాలా? అనేది ఇప్పుడు వైసీపీ లో అంతర్గతంగా జరు గుతున్న హైలెవిల్ చర్చగా తెలుస్తోంది.
అది అత్యంత కీలక పదవి. ఎంతో మంది కాకలు తీరిన నాయకులు.. కూడా ఆపదవి కోసం ఎదురు చూస్తా రు. ఆ పదవి దక్కితే చాలని కూడా అనుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. మొక్కులు మొక్కుతారు.. పార్టీ అధినేతల చుట్టూ గిరికీలు కూడా కొడతారు. అదే.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి. ఈ పదవి కోసం.. అనేక మంది సీనియర్ నాయకులు ఇప్పుడు పోటీలో ఉన్నారు.
అయితే.. ఎవరికి ఇవ్వాలన్నా.. గతంలో అయితే, కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు కూడా అనేక ఈక్వేష న్లు చూసుకునేది. పార్టీని-ప్రజలను-ఓటుబ్యాంకును.. ఇలా మూడు విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునేవారు. దీంతో ఈ కీలకమైన పదవికి రాజకీయ రంగు పులుముకుంది. సరే.. ప్రస్తుత విషయానికి వస్తే.. ఈ పదవి లో వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఈయనకు రెండు సార్లు ఈ పదవి ఇచ్చారు.
రెండేళ్లపాటు ఆయనే 4 సంవత్సరాలు టీటీడీ పాలక మండలి బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరించారు. ఇక, ఇప్పుడు ఆయనను పార్టీ విస్తృత కార్యక్రమాలకు వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు ఖాళీ అవుతోంది. అయితే.. దీనిని దక్కించుకునేందుకు.. నాయకులు రెడీగా ఉన్నారు. ఇక, ఎవరికి ఇవ్వాలనే విషయం పై వైసీపీ లోనూ తర్జన భర్జన సాగుతోంది. ఈ పదవిని ఎవరికి ఇచ్చినా.. ఓటు బ్యాంకు పరంగానూ లెక్కులు చూసుకుంటున్నారని సమాచారం.
ఈ క్రమంలో బీసీ నేతకు ఇవ్వాలా? లేక ఓసీలకు ఇవ్వాలా? అనేది ఇప్పుడు వైసీపీ లో అంతర్గతంగా జరు గుతున్న హైలెవిల్ చర్చగా తెలుస్తోంది. బీసీ నేతగా జంగా కృష్ణమూర్తి(ప్రస్తుతం ఎమ్మెల్సీ)కి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఆయనకు ఇవ్వడం ద్వారా బీసీల ను తమవైపు తిప్పుకొనే వ్యూహం. రెండోది ఎమ్మెల్సీ స్థానం ఒకటి ఖాళీ అవుతుంది.
అయితే.. ఇదేసమయంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్దా రాఘవరావు పేరు కూడా వినిపిస్తోంది. మాజీ మంత్రి అయిన శిద్దా.. టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చాక.. ఎలాంటి పదవినీ ఆశించకుండానే ఉన్నారు. అయితే.. ఎన్నికల కు ముందు ఉభయ కుశలోపరిగా ఆయనకు టీటీడీ చైర్మన్ పోస్టును ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.