విపక్షంగా మారిన టీడీపీ.. అసెంబ్లీలో చిత్రం!
ఇలానే ఇప్పుడు కూడా.. చంద్రబాబు సూచనలతో 30 మంది ఎమ్మెల్యేలు.. విపక్షం పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారు.
ఏపీలో కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న టీడీపీకి ఇప్పుడు మరో బాధ్యత కూడా వచ్చి పడింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రతిపక్షం వైసీపీ పూర్తిగా బాయ్‌కాట్ చేసింది. దీంతో సభలో ప్రజల తరఫున ప్రతిపక్షం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం చెప్పాలన్న కూటమి సర్కారు ఆలోచన ముందుకు సాగడం లేదు. మరీ ముఖ్యంగా ప్రతిపక్షం లేని లోటు కూడా కనిపిస్తోంది. దీంతో కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్న టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షం అవతారం ఎత్తింది.
కొంత మంది ఎమ్మెల్యేలను ప్రతిపక్షం పాత్ర పోషించాలంటూ సీఎం చంద్రబాబు సూచనలతో పలువరు టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ సభ్యులు సభలో ఉంటే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అలానే ప్రశ్నలు సంధి స్తున్నారు. అయితే.. వారిలా అగ్రసివ్‌గా కాకుండా.. చాలా నిర్మాణాత్మకంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. వీరు సంధిస్తున్న ప్రశ్నలకు కూటమి మంత్రులు, బాధ్యులైన వారు సమాధానం చెబుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి కూడా సభా వ్యవహారాలు పూర్తిగా మారిపోయాయి.
అధికార పక్షం నాయకులే ప్రతిపక్ష నాయకులుగా మారి ప్రశ్నలు సంధించడం అనేది టీడీపీకి కొత్తకాదు. గతంలో జగన్ 2017-19 మధ్య కూడా ఇలానే సభకు రాకుండా డుమ్మా కొట్టారు. అప్పట్లో తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపిస్తూ.. ఆయన సభ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేశారు. ఆ సమయంలో కూడా.. ప్రజల గొంతకైన టీడీపీ.. ప్రతిపక్ష పాత్ర పోషించింది. అప్పట్లోనూ జిల్లాకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలను సమస్యల కోసం కేటాయించింది.
ఇలానే ఇప్పుడు కూడా.. చంద్రబాబు సూచనలతో 30 మంది ఎమ్మెల్యేలు.. విపక్షం పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారు. వారి వారి నియోజకవర్గాల సమస్యలే కాకుండా.. కామన్‌గా ఉండే సమస్యలను కూడా ప్రస్తావించి.. సమాధానం రాబట్టడం ద్వారా ప్రజల సమస్యలకు సభలో పరిష్కారం లభించేలా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా టీడీపీకి గతంలోనూ.. ఇప్పుడు కూడా విపక్ష బాధ్యతలు మాత్రం తప్పలేదు.