తుమ్మల వర్సెస్ పొంగులేటి... కాంగ్రెస్ కు కొత్త టెన్షన్!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. కర్నాటక ఎన్నికల ఫలితాలకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయాయన్నా అతిశయోక్తి కాదేమో.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. కర్నాటక ఎన్నికల ఫలితాలకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయాయన్నా అతిశయోక్తి కాదేమో. కారణం.. ఆ ఫలితాలు ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. బీఆరెస్స్ కు ప్రత్యామ్నాయం బీజేపీ లేక కాంగ్రెస్ అనుకుంటున్న దశలో కాస్త క్లారిటీ ఇచ్చిన ఫలితాలవి! నాటి నుంచి కాంగ్రెస్ క్యాడర్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఇదే సమయంలో చేరికలు కూడా భారీగా జరిగాయి. అధికార బీఆరెస్స్ లో అసంతృప్తులకు ఫస్ట్ ఆప్షన్ గా కాంగ్రెస్ పార్టీ మారింది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఖమ్మం జిల్లాలో ఫిజికల్ గా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మోరల్ గా పార్టీకి కొత్త బలం వచ్చిందనే కామెంట్లు వినిపించాయి.
అనంతర పరిణామాలతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సైతం బీఆరెస్స్ నుంచి బయటకు వచ్చి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇద్దరూ ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు మీదే మనసుపడ్డారు. అవును... పాలేరు నియోజకవర్గం పై అటు పొంగులేటీ ఎప్పుడో కర్చీఫ్ వేశారని కథనాలొచ్చిన నేపథ్యంలో... పాలేరు పై ఆశతోనూ, హామీతోనూ తుమ్మల కాంగ్రెస్ లో చేరారని చెబుతున్నారు.
మరోపక్క తన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం షర్మిళ కూడా కాంగ్రెస్ టిక్కెట్ పై పాలేరు నుంచే పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పాలేరు నియోజకవర్గ పంచాయతీలు మొదలయ్యాయని తెలుస్తుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరు లో పోటీచేసేది ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సమస్యను కాంగ్రెస్ పెద్దలు ఎలా పరిష్కరిస్తారనేది వేచి చూడాలి.
కాగా... 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి తర్వాత బీఆరెస్స్ లో చేరిపోయారు. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ కేడర్ మాత్రం అలా బలంగానే ఉందని అంటున్నారు. దీంతో ఇక్కడ నుంచి పోటీచేయడం కోసం స్థానిక కాంగ్రెస్ నాయకులతోపాటు షర్మిళ కూడా పోటీ పడుతున్నారని తెలుస్తుంది.