కలెక్టర్‌పై దాడి: వెలుగులోకి సంచలన అంశాలు

ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణ నిమిత్తం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడికి యత్నించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2024-11-12 09:11 GMT

ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణ నిమిత్తం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడికి యత్నించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడిన 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో కీలకంగా భావిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీలను స్థాపించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, పులిచెర్లతండా, రోటిబండ తండాల్లో 1,358 ఎకరాల భూములను సేకరించాలి నిర్ణయించింది. ఇందులో 547 ఎకరాలు అసైన్డ్ భూమి, 90 ఎకరాల ప్రభుత్వ భూమి, 721 ఎకరాల పట్టా భూమి ఉంది. సుమారు 800 మంది రైతులకు చెందిన ఈ భూమిని ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికే నిరసనలు తెలిపారు. నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు.

రైతులు భూములు ఇస్తే వారికి ఎకరాకు రూ.10 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఒక్కో ఎకరానికి 125 గజాల ప్లాటుతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. కానీ.. దానికి ఆ రైతులు ఒప్పుకోవడం లేదు. ఇందులో భాగంగా నిన్న గ్రామసభ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. లగచర్లలో గ్రామసభ కోసం అధికారులు రాగానే ఆందోళనకారులు రెచ్చిపోయారు. భూ సేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ కేసులో సురేశ్ అనే వ్యక్తిని నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సురేశ్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఈయను 42 సార్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసు రాజకీయ కోణం వైపు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. కలెక్టర్‌పై దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీఎస్ శాంతికుమారి కూడా ఆరా తీశారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రిపోర్టు ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

Tags:    

Similar News