ఏపీ డిప్యుటీ స్పీకర్ పదవి విషయంలో బిగ్ ట్విస్ట్?
ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో బిగ్ ట్విస్ట్ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీలో భారీ ఘన విజయం అనంతరం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మిగిలిన మంత్రులు బాధ్యతలు స్వీకరించేస్తున్నారు! ఈ సమయంలో మరో రెండు రోజుల్లో శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో బిగ్ ట్విస్ట్ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 21న మొత్తం 175 మంది నూతన ఎమ్మెల్యేలతోనూ ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. ఆ మరుసటి రోజు.. అంటే ఈ నెల 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.
ఈ క్రమంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్నా సంగతి తెలిసిందే. ఈ మేరకు శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కోరిక మేరకు బుచ్చయ్య చౌదరి ఆ బాధ్యతలు తీసుకోనున్నారు! దీంతో... ఈనెల 20న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయిస్తారు.
మరోపక్క స్పీకర్ గా ఇప్పటికే అయ్యన్నపత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. ఇలా స్పీకర్, ప్రోటెం స్పీకర్ విషయంలో క్లారిటీ వచ్చిన వేళ.. డిప్యుటీ స్పీకర్ విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి డిప్యుటీ స్పీకర్ పదవి.. జనసేనకు వెళ్లే అవకాశం ఉందని, అది సహేతుకం కూడా అనే చర్చ జరిగింది!
అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో జనసేన నుంచి లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ ల పేర్లు కూడా పరిశీలను వచ్చినట్లు కథనాలొచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఈ పదవి బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఈ ట్విస్ట్ తప్పదని తెలుస్తుంది.
ఇందులో భాగంగా బీజేపీకి ఒక్క మంత్రి పదవే ఇవ్వడం.. వారు మరో పదవి అడుగుతున్నారనే కథనాలు రావడం తెలిసిందే. ఈ మేరకు బీజేపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనికోసం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు ఫైనల్ కావొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రెండు మిత్రపక్షాలనూ సంతృప్తి పరిచినట్లు ఉంటుందని బాబు భావిస్తున్నారని అంటున్నారు.