అటు తెలంగాణ - ఇటు ఏపీ.. ఈ సమస్యలు ఇంతేనా....?
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. అయితే.. 10 ఏళ్ల తర్వాత కూడా.. ఇరు ప్రాంతాల ప్రజలు బాగానే ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. అయితే.. 10 ఏళ్ల తర్వాత కూడా.. ఇరు ప్రాంతాల ప్రజలు బాగానే ఉన్నారు. కలివిడి గానే వ్యాపారాలు చేసుకుంటున్నారు. సంబంధాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. కానీ, పాలించే నాయకుల మధ్యే భేషజాలు కొనసాగుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఇచ్చిపుచ్చుకునే క్రతువు ముందుకు సాగకపోవడానికి కారణం.. పాలకులేనన్న విషయం తెలిసిందే.
గతంలో చంద్రబాబు-కేసీఆర్, తర్వాత.. కేసీఆర్-జగన్, ఇప్పుడు రేవంత్‌రెడ్డి-చంద్రబాబు. ఇలా.. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మారారు. కానీ, ఇరు రాష్ట్రాల విభజన హామీలు మా త్రం నెరవేరలేదు. అంతేకాదు... ఇరు రాష్ట్రాల మధ్య పంచుకోవాల్సిన అప్పులు.. ఆస్తులు కూడా ఇప్పటి కీ తేలలేదు. కనీసం.. కేంద్రం నుంచి రాబట్టుకునే అంశాలపైనా ఉమ్మడి పోరాటం చేయాలన్న స్పృహ కూడా ఇరు రాష్ట్రాల మధ్య కనిపించడం లేదు.
సరే.. ప్రస్తుత ముఖ్యమంత్రుల విషయానికి వస్తే.. ఏపీకి సహకరించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమేనని ప్రకటించినా.. ఆ రాష్ట్ర ప్రయోజనాల పరంగా చూసుకుంటే.. ఆయన సహకరిం చడం కష్టమనే భావన కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో భారీ మెజారిటీతో అక్కడ కాంగ్రెస్ సర్కారు లేదు. అత్తెసరు మార్కులతోనే ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఏమాత్రం ఆయన ఏపీకి సహకరిస్తున్నారని ప్రచారం జరిగినా.. ఇబ్బందే.
ఇక, చంద్రబాబు కూడా.. తెలంగాణను నిలదీసేలా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఆయన కూడా.. తెలంగాణలో ఎదగాలని.. పార్టీని నిలబెట్టాలని భావిస్తున్నారు. అంటే.. ఒకరకంగా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరమీదికి తీసుకువస్తున్నారు. కాబట్టి.. ఆయన తెలంగాణ నుంచి రావాల్సినవి గుంజుకుని తెచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీంతో ఏపీ-తెలంగాణల మధ్య పరిస్థితి అలానే ఉంటుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.