ఉదయనిధి స్టాలిన్ మరో రచ్చ!
మరోవైపు ఈ స్థాయిలో తన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతున్నా తగ్గేదే లే అని ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నారు
సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోలుస్తూ దాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే ప్రభుత్వంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారితీశాయి.
ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంస్థలు, సంఘాలు, పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన పరంధాస్ ఆచార్య అనే స్వామిజీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తల నరికి తనకు తెచ్చి ఇస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కలకలం రేపారు. ఈ సందర్భంగా ఒక చేతిలో ఉదయనిధి ఫోటో, మరో చేతిలో అతడి తలను నరుకుతున్న వీడియోను స్వామజీ పరంధాస్ ఆచార్య చూపించారు. ఈ పని మీరు త్వరగా చేస్తే రూ. 10 కోట్లు ఇస్తాను అంటూ పేర్కొన్నారు.
అలాగే ఏపీలో జనజాగరణ సమితి సైతం ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ పేర్కొంది. ఈ మేరకు విజయవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఒక ఫోన్ నంబర్ ను కూడా పొందుపరిచింది.
మరోవైపు ఈ స్థాయిలో తన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతున్నా తగ్గేదే లే అని ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నారు. తనపైన కేసులు వేసుకున్నా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని అంటున్నారు. ఇవేవీ తాను ఇప్పుడు చెప్తున్నవి కాదని అంబేద్కర్, పెరియార్ వంటివారు ఎప్పుడో చెప్పారంటూ తన వ్యాఖ్యలను ఉదయనిధి సమర్థించుకుంటుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఉదయనిధి మరోమారు కాకరేపారు. ఈసారి ఆయన ఇందుకు ట్విట్టర్ (ఎక్స్)ను ఎంచుకున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పెట్టిన ఓ ఫొటో వ్యవహారం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఉదయనిధి స్టాలిన్.. ట్విట్టర్ లో దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోకి ఆయన ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అలాగే ఎలాంటి వ్యాఖ్యలను పోస్టు చేయలేదు.
అయితే సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన డెంగీ, మలేరియా వ్యాఖ్యలను ఈ ఫొటో గుర్తుకు తెస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సనాతన ధర్మం.. డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దాన్ని నియంత్రించడం కాదు నిర్మూలించాలంటూ ఉదయనిధి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోమలను చంపే చక్రం (కాయిల్) ఫొటోను ఆయన వాడటం విమర్శలకు తావిచ్చింది. ఈ పోస్టుపై నెటిజన్లు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు.