మీ ఇంట్లో హైస్కూల్ పిల్లలున్నారా? మిస్ కాకుండా చదవండి

తాజాగా క్రోమింగ్ ఛాలెంజ్ పేరుతో ఒక ప్రమాదకరమైన సవాలును తీసుకుంటున్నారు చిన్నారులు.

Update: 2024-09-05 07:30 GMT

మీ ఇంట్లో హైస్కూల్ చదివే పిల్లలు ఉన్నారా? లేదంటే.. మీకు తెలిసిన హైస్కూల్ చదివే పిల్లలు ఉన్నారా? అయితే.. మిస్ కాకుండా చదవాల్సిందే. సోషల్ మీడియా పుణ్యమా అని పిచ్చ అలవాట్లు చాలానే వచ్చి చేరుతున్నాయి చాలామంది జీవితాల్లో. వయసులో చిన్నోళ్లకు ఏది మంచి? ఏది చెడు? అన్నది తెలిసే అవకాశం ఉండదు. తమ చుట్టూ ఉన్న తమ ఈడు పిల్లల్ని చూసి వారు సైతం కొన్నింటికి ఇట్టే ఆకర్షితులవుతుంటారు. ఇప్పుడు అలాంటి ఒక దరిద్రపుగొట్టు ట్రెండ్ ఒకటి కౌమార పిల్లలకు వచ్చి చేరింది.

తాజాగా క్రోమింగ్ ఛాలెంజ్ పేరుతో ఒక ప్రమాదకరమైన సవాలును తీసుకుంటున్నారు చిన్నారులు. ఇంతకూ ఈ క్రోమింగ్ ఛాలెంజ్ ఏమిటన్నది చూస్తే.. పెయింట్.. పెట్రోల్.. నెయిల్ పాలీష్.. ఫ్లోర్ క్లీనింగ్ ఉత్పత్తులకు సంబంధించిన ప్రమాదకర రసాయనాల్ని పీల్చడాన్ని క్రోమింగ్ గా వ్యవహరిస్తారు. ఇలా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు వస్తుంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి యూకేలో చోటు చేసుకుంది.

బ్రిటన్ లోని సౌత్ యార్క్ షైర్ కు చెందిన బాలుడు ఇంట్లో ఒక్కసారిగా స్ప్రహ తప్పి పడిపోయాడు. ఒక్కసారిగా దబ్బున పడిన శబ్దంతో అలెర్టు అయిన అతడి తల్లి వెళ్లి చూడగా.. పిల్లాడు శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించి షాక్ తింది. గుండెపోటుగా భావించిన ఆమె.. కొడుక్కి సీపీఆర్ చేయటంతో పాటు.. అత్యవసర చికిత్స కోసం సమాచారాన్ని అందించారు.

ఆ పిల్లాడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తున్న వేళలో పలుమార్లు మూర్ఛ.. గుండెపోటుకు గురయ్యాడు. చివరకు వైద్యుల పర్యవేక్షణ కారణంగా ప్రాణాపాయం తప్పింది. ఇంతకూ ఆ పిల్లాడికి అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందన్న విషయాన్ని ఆరా తీస్తే.. క్రోమింగ్ ఛాలెంజ్ అని గుర్తించారు. ఇదే విషయాన్ని వైద్యులతో పాటు పోలీసులు సైతం నిర్దారించారు. తన కొడుక్కి ఎదురైన ఈ చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో పిల్లాడి తల్లి వివరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మీ ఇంట్లో ఉండే పిల్లల విషయంలో ఒక కన్నేసి ఉంచటంతో పాటు.. ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని జాగ్రత్తగా వివరించి చెప్పాల్సిన బాధ్యత పెద్దోళ్ల మీదే ఉందన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News