అరెస్ట్ లిస్ట్ లో అల్టిమేట్ రాజ గురువు...?

ఒక ప్రముఖుడిని రాజకీయ జనం పరిభాషలో రాజ గురువుగా పేరు పొందిన ఒక పెద్ద మనిషిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు.

Update: 2023-09-29 04:51 GMT

యుద్ధం ప్రారంభించనే కూడదు, ఒకసారి ప్రారంభించాక వెనక్కి తగ్గకూడదు, మంచో చెడో ముందుకు దూసుకెళ్ళడమే. ఇదే రాజనీతి, యుద్ధ నీతి కూడా. ఏపీలో వైసీపీ వర్సెస్ దుష్టచతుష్టయంగా సాగుతోంది. ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఏమీ దాచుకోవడంలేదు కూడా. తాము యుద్ధం చేస్తున్న వారి పేర్లను కూడా ప్రతీ సభలో చెబుతూనే వస్తోంది.

దీని మీద టీడీపీ అనుకూల మీడియా అయితే జగన్ మీద ఇదే రాసుకొచ్చింది. సరే చంద్రబాబు అరెస్ట్ అయింది. దానికి కారణం ఆయన తన హయాంలో చేసిన అవినీతి అని చెబుతున్నా టీడీపీ మాత్రం కక్ష సాధింపు చర్యలు అనే అంటోంది. ఇక లోకేష్ అరెస్ట్ ఉంటుందని కూడా అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ శిబిరంలోకి మళ్లీ వచ్చిన రెబెల్ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అయితే తమకు అందిన సమాచారం ప్రకారం లోకేష్ తో పాటు బాలయ్య, భువనేశ్వరి, బ్రాహ్మణిలను కూడా అరెస్ట్ చేస్తారని సంచలన కామెంట్స్ చేశారు.

తాము న్యాయ పోరాటం దీని మీద చేస్తామని, అలాగే రాజకీయ పోరాటం కూడా చేస్తామని ఆయన ప్రకటించారు. సరే ఈ అరెస్టుల పరంపర అలాగే కొనసాగుతుందని ఊహించిన వారు ఊహిస్తున్నారు. లేదు ఇక్కడితో సరి అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వ హయాంలో అనేక స్కాములు జరిగాయని వరసబెట్టి వర్షాకాల సమావేశాలో ప్రతీ రోజూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి మంత్రుల చేత సుదీర్ఘ ప్రసంగాలు చేయించిన ప్రభుత్వం వాటిని అలా చూస్తూ వదిలేస్తుందా అంటే కుదరని పనే అంటున్నారు.

ఈ రోజుకీ అమరావతి స్కాం అని అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం మీద కూడా అసెంబ్లీలో చర్చ సాగింది. వీటిని అన్నీ చూస్తూంటే రానున్న రోజులలో రాజకీయం మరింత హీటెక్కేలా ఉందని అంటున్నారు. ఇక సెప్టెంబర్ నెల చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలోనే అతి పెద్ద సెన్సేషన్ గా ముగుస్తోంది.

వస్తోంది అక్టోబరు. ఈ నెలలో ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయనే అంటున్నారు. ఏకంగా ఒక మూల విరాట్టుని, ఒక ప్రముఖుడిని రాజకీయ జనం పరిభాషలో రాజ గురువుగా పేరు పొందిన ఒక పెద్ద మనిషిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. అది కదా అల్టేమేట్ అరెస్ట్ అని అంటున్నారు అంతా.

దానికి సంబంధించిన చర్చ అయితే చాన్నాళ్ళుగా జరుగుతూనే ఉంది. ఆయనకు సంబంధించిన వ్యాపారాలలో సోదాలు ఇప్పటికే జరిగాయని విచారణ పూర్తి అయిందని ఈ కేసులో సరైన సమయం చూసి ఏ వన్ ఏ టూలుగా ఉన్న వారిని అరెస్ట్ చేయడమే రాజకీయ భూకంపం లాంటి వార్త అని అంటున్నారు.

అంటే ఏపీలో రానున్న అక్టోబర్ నెల కూడా రాజకీయంగా మండించే సంఘటనలతో నిండిపోతుందని అంతా ఊహిస్తున్నారు మరి ఇది ఎంత వరకూ సాధ్యం అన్నది కూడా చర్చకు వస్తోంది. కానీ రాజకీయాలలో అసాధ్యాలు సుసాధ్యాలు చేయడమే ఉంటాయి. ఇక వైసీపీ అధినాయకత్వం విషయం తీసుకుంటే తలచుకోవాలే కానీ యాక్షన్ లోకి దిగిపోవడం ఖాయమని కూడా అంటూంటారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్ అన్నది ఆరంభం మాత్రమే అని అసలైన కధ ముందు ఉందని అంటున్నారు.

ఇక తెలుగుదేశం వారు సైతం అరెస్టులు ఇంకా చాలా ఉన్నాయనే అంటున్నారు. ఈ కారణంగానే లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీకి రావడం కూడా జాప్యం జరుగుతోంది అని అంటున్నారు. మొత్తానికి అరెస్టులతో ఏమి సాధిస్తారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. జవాబు కూడా ఈజీయే. సాధించినవి సాధిస్తారు అని. వీటితో జనాలకు సంబంధం ఉంటుందా ఉంటే ఎంతమేరకు, అసలు ఈ అరెస్టులు రాజకీయంగా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్నది కూడా ఇపుడు ఆలోచించడంలేదు. ఎందుకంటే ఆ స్టేజ్ ని దాటిపోయాయి కాబట్టి. సో ప్రచారంలో ఉన్న అరెస్ట్ లిస్ట్ చాలా పెద్దదే. అల్టేమేట్ అరెస్ట్ కనుక జరిగితే మాత్రం ఏపీ లో ఏమి జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది మరి.

Tags:    

Similar News